
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీ ‘అభయహస్తం’ కింద ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ కంప్యూటరీకరించింది. ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు మంగళవారం రాత్రి వరకే ఈ పని పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 635 కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం దరఖాస్తుల్లో పాతబస్తీ నుంచే అత్యధికంగా అందగా, అక్కడి ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట సర్కిళ్ల నుంచి అత్యధిక కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. రామచంద్రాపురం–పటాన్‌చెరు సర్కిల్ చిన్న సర్కిల్ కావడంతో అక్కడి నుంచి కూడా తక్కువ దరఖాస్తులందాయి.
రేషన్ కార్డుల కోసం
ప్రజాపాలన కింద ‘అభయహస్తం’ దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డులు, ఇతరత్రా అవసరాలకు సంబంధించిన దరఖాస్తుల్ని సైతం అధికారులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజైన ఈ నెల 6వ తేదీ వరకు సదరు అర్జీలు 5,73,069 అందినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. అభయహస్తం కింద అప్పటి వరకు 19,01,256 దరఖాస్తులు అందినట్లు ప్రకటించినప్పటికీ.. ఆన్‌లైన్ ప్రక్రియ ముగిసేటప్పటికి వాటిని 19,06,137గా తేల్చారు. స్వీకరణ చివరి రోజున ఆలస్యంగా అందిన అర్జీలు అప్పడు లెక్కలోకి రాకపోవడమో.. ఆ తర్వాత ఆయా కార్యాలయాల్లో స్వీకరించిన వినతులు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్లనో ఈ సంఖ్య పెరిగి ఉంటుందని చెబుతున్నారు.
గాలిలో దరఖాస్తులతో ఆందోళన
గ్యారంటీల దరఖాస్తుల్ని బయటి వ్యక్తులతో తరలిస్తుండగా అవి గాల్లోకి ఎగిరి పోవడంతో ఎవరి దరఖాస్తులైనా పోయాయేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారులు మాత్రం ఏ ఒక్క దరఖాస్తూ పోలేదని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఆ తర్వాత తగిన శ్రద్ధ చూపారు. ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఐదువేల మందికి పైగా ఆపరేటర్లతో కంప్యూటరీకరణ పూర్తి చేయించారు. రేషన్‌కార్డులు, ఇతరత్రా ఫిర్యాదులకు సంబంధించిన దరఖాస్తులు సర్కిల్, జోన్‌ల వారీగా అధికారులు వెల్లడించలేదు. వీటిలో రేషన్ కార్డులవే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
గ్యాస్, పెన్షన్ల కోసం
అభయహస్తం కింద ఐదు పథకాలకు దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్‌ల కోసం ఎక్కువ మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏ స్కీమ్‌కు ఎందరు దరఖాస్తుచేసుకున్నారనేది వెల్లడయ్యేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున ఆయన తిరిగి వచ్చాక ఈ దరఖాస్తులకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై స్పష్టత రానుందని జీహెచ్‌ఎంసీ అధికారులు అధికారులు చెబుతున్నారు.
జోన్ల వారీగా..
ఆన్‌లైన్ నమోదు పూర్తయిన దరఖాస్తులు జోన్ల వారీగా ఇలా ఉన్నాయి.
జోన్ ఆన్‌లైన్
ఎల్‌బీనగర్ 242579
చార్మినార్ 508772
ఖైరతాబాద్ 325641
శేరిలింగంపల్లి 170811
కూకట్‌పల్లి 314685
సికింద్రాబాద్ 300051
కంటోన్మెంట్ 43598
మొత్తం 1906137