
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది.
ఐటీ కారిడార్‌లో లాగౌట్ పొడిగింపు
నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ఆగస్టు 1 వరకు లాగౌట్‌ను పొడిగిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరకుండా.. 3 దశలుగా విధుల ముగింపు వేళలు ఉండాలని పేర్కొంది.
యాదాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చదవండి: ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు
ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది.