శనివారం చింతల్ బస్తీలో వర్ష బీభత్సం
శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది ఆదివారం అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆ అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, మేడ్చల్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో కుండపోత వానలుపడే అవకాశం ఉందని తెలిపారు. ఇక నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోందని.. రెండు రోజుల్లో ఉత్తర భారతం నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయని వివరించారు.
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రిదాకా భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు, పిడుగులు పడటంతో ప్రజలు బెంబేలెత్తారు.
హైదరాబాద్ ఆగమాగం..
హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం రాత్రి వరకు దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. జనం ఇళ్లనుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట, ఎల్బీనగర్, కొత్తపేట, చార్మినార్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, మలక్‌పేట వంటి ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా కాలనీల ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. వరదతో చెరువులు, నాలాలు ఉప్పొంగాయి. పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
దసరా సెలవులు కావటంతో సొంతూర్లకు బయలుదేరినవారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఇబ్బందిపడ్డారు. లోతట్టు ప్రాంతాలు, మూసీ నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను జీహెచ్‌ఎంసీ, పోలీసులు అప్రమత్తం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ శివగంగ థియేటర్ ప్రహరీగోడ కూలిపోయి.. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై పడింది. సుమారు 50 బైక్‌లు ధ్వంసమయ్యాయి. హైదర్‌గూడ ప్రాంతంలో మూసీ నదిలో మొసలి బయటికి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
రోడ్లపై గుంతలతో..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. నిర్మాణాల కోసం ఆయా చోట్ల రహదారులను తవ్వడంతో.. గుంతలు పడ్డాయి. వాటిలో వాన నీళ్లు నిండటంతో.. వాహనదారులు భయంభయంగా ప్రయాణించాల్సి వచ్చింది.
పలు జిల్లాల్లోనూ..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచీ వర్షం దంచికొట్టింది. నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 4,008 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఉండవెల్లి మండలంలో ఉల్లిపంట నీట మునిగింది. వరద పోటెత్తడంతో సంగంబండ రిజర్వాయర్, కోయిల్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షం ధాటికి జనగామ జిల్లాలోని పెంబర్తి సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి కోతకు గురైంది.
జూరాలకు భారీ వరద
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరిగింది. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రాజెక్టులోకి 82,471 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎనిమిది గేట్ల ద్వారా, జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కలిపి 79,571 క్యూసెక్కులను దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు.
పిడుగులకు ఐదుగురు బలి
రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో పెద్ద సంఖ్యలో పిడుగులు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నలుగురు, హన్మకొండ జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు బలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
► ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన బనియ గరన్‌సింగ్(45), ఆయన తమ్ముడు సర్దార్‌సింగ్ శనివారం తమ పొలాల్లో సోయా పంటకోత పనులు చేపట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వాన మొదలవడంతో సర్దార్‌సింగ్ భార్య ఆశాబాయి (30), గరన్‌సింగ్ ఇద్దరూ సమీపంలోని చింతచెట్టు కిందికి వెళ్లారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో చనిపోయారు. ఆశాబాయికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
► ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని తాంసి మండలం బండల్‌నాగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పత్తి ఏరేందుకు.. మహారాష్ట్రలోని మహోర్ తాలూకా బావునే గ్రామానికి చెందిన కూలీలు వచ్చారు. వారు చేనులో పనిచేస్తుండగానే సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పిడుగుపడింది. రాథోడ్ దీప (15) అనే బాలిక అక్కడికక్కడే చనిపోగా.. పక్కనే ఉన్న ఆమె తల్లి బబిత, విజయలక్ష్మి, శోభా పవార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
► కుమురంభీం జిల్లా జైనూరు మండలం గుడమామడకు చెందిన రైతు మొట్కర్ గణపతి, కుమ్ర కోద్దు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం భారీ వర్షం మొదలవడంతో పొలంలోని పందిరి కిందికి వెళ్లారు. కాసేపటికే వారిపై పిడుగుపడింది. గణపతి (35) అక్కడికక్కడే చనిపోగా.. కోద్దుకు తీవ్ర గాయాలయ్యాయి.
► హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన గోళ్ల తిరుపతి (39) అనే కౌలురైతు శనివారం పొలంలో మిర్చినారు పెడుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మాజీ మంత్రి ఈటల పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మూగజీవాలు కూడా..
పిడుగుపాటు కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మక్తల్ మండలం రుద్రసముద్రంలో 70 గొర్రెలు మృతిచెందాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాంగ్వి(కె) గ్రామంలో 15 మేకలు, బండల్‌నాగాపూర్‌లో ఆవు, దూడ, పిప్పల్‌కోటిలో ఎద్దు, మంచిర్యాల జిల్లా పొలంపల్లిలో మేకపోతు, రెండు గొర్రెలు చనిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment