
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి మంతనాలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై చర్చ
ఆ భూములకు ఎలాంటి చట్టబద్ధత కల్పించలేదన్న రేవంత్!
1,500కు పైగా ఎకరాలపై వర్సిటీకి హక్కులు కల్పిద్దామని వెల్లడి!
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) భూములకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుబాటులో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలతో సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో జరిగిన ఈ భేటీలో యూనివర్సిటీ భూములు, పూర్వాపరాలపై చర్చించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. హెచ్‌సీయూకు 1975లో భూమి కేటాయించినా.. అప్పటి నుంచి ఇప్పటివరకు యూని వర్సిటీకి ఎలాంటి చట్టబద్ధత కల్పించలేదని వివరించినట్లు సమాచారం. వాస్తవానికి 2,300 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించినా.. వివిధ దశల్లో ప్రభుత్వ అవసరాల కోసం భూమిని తీసుకుంటూ వచ్చినట్టుగా చెప్పారని తెలిసింది. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో ఉన్న 1,500కు పైగా ఎకరాలపై యూనివర్సిటీకి హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందామని అన్నట్టు తెలిసింది.
ఆ భూముల్లోనూ శిలలు, చెరువులు కాపాడదాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి చేయాలనుకుంటున్న 400 ఎకరాల్లోనూ.. యూనివర్సిటీ విద్యార్థులు, పర్యా వరణవేత్తల మనోభావాలు దెబ్బతినకుండా సహజ సిద్ధ శిలా సంపద లేదా చెరువులను కాపాడుదామని ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబులను కోరినట్లు తెలిసింది. వీరి ప్రతిపాదనతో ముఖ్యమంత్రి కూడా ఏకీభవిస్తూ.. వాటిని ఎట్టిపరిస్థితు ల్లోనూ పరిరక్షించాల్సిందేనని స్పష్టం చేసినట్లు చెబుతు న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమా నికీ ఏదో విధంగా అడ్డుపుల్లలు వేయడమే పనిగా విపక్షాలు పెట్టుకున్నాయని, ఇప్పుడు కూడా విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. కాగా ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని, అందులో ఎలాంటి వివాదం లేదని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పినట్లు తెలిసింది.

వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మంత్రుల సమావేశం
ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు.. వర్సిటీ మాజీ ప్రొఫెసర్లు డి.నర్సింహారెడ్డి, హరగోపాల్, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పర్యావరణవేత్తలతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. యూనివర్సిటీకి భూముల కేటాయింపు, అలైనేషన్ లేక పోవడం, వివిధ అవసరాల కోసం ప్రభుత్వం భూమి తిరిగి తీసుకోవడం లాంటి వివరాలను వారికి వివరించారు.