సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కుండపోత వానపడింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవగా.. రాత్రి 9 గంటల నుంచి ప్రాంతాల వారీగా భారీ వర్షం పడింది. అర్ధ్థరాత్రి తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. దీనితో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
నాలాల వెంబడి వరద ఉధృతంగా ప్రవహించింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక జనం ఆందోళనకు లోనయ్యారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శేరిలింగంపల్లి ఖాజాగూడలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్, సుచిత్ర, సూరారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది. అధికార యంత్రాంగం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
నగరంలో వర్షపాతం ఇలా.. (సెంటీమీటర్లలో)
ప్రాంతం వర్షపాతం
ఖాజాగూడ 6.3
షేక్‌పేట 5.2
జూబ్లీహిల్స్ 4.6
మాదాపూర్ 4.5
సింగిరేణికాలనీ 4.1
అమీర్‌పేట 4.0
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ 3.8
విద్యుత్ తీగ తెగిపడి కానిస్టేబుల్ మృతి
భారీ వర్షం, ఈదురుగాలులతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ ప్రాంతం మీదుగా బైక్‌పై వెళుతున్న గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ వీరాస్వామి (40)పై ఆ తీగలు పడటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో నివసించే సోలెం వీరాస్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి 9.40 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్తున్నారు. అప్పటికే బలమైన ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలైంది. ఈ సమయంలో విద్యుత్ తీగ తెగి వీరాస్వామిపై పడింది. షాక్‌కు గురైన ఆయన బైక్‌పై నుంచి కిందపడి అపస్మారక స్థితిలో పడిపోయారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ పోలీసులు వీరాస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరాస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం అని.. యూసఫ్‌గూడ బెటాలియన్‌లో మిత్రుడిని కలిసి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment