power outage
-
Power Outage: అంధకారంలో శ్రీలంక
కొలంబో: శ్రీలంకలో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. దేశంలో మొత్తం విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యలతో పవర్ కట్ జరిగినట్లు ఆ దేశ విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే దేశంలో కరెంట్ అంతరాయం కలగటంతో పలు ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. Countrywide Power Outage Reported in Sri Lanka 🇱🇰 A widespread power outage struck Sri Lanka, according to a spokesperson from the #Electricity Supply Council who spoke with local media. 1/3 | #SriLanka | #srilankan | pic.twitter.com/u5xBGO8z7E — Sputnik India (@Sputnik_India) December 9, 2023 దేశంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని సీఈబీ సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. ఇక మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #Srilanka countrywide #power outrage is by possible tripping of the main transmission line caused by lightning . NOT possible sabotage as controversial restructuring electricity bill presented parliament yeasterday amidst union protest. pic.twitter.com/SKG4gPVtRe — Vajira Sumedha🐦 🇱🇰 (@vajirasumeda) December 9, 2023 -
రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి విద్యుత్ అంతరాయం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజాదేవ్ (ఎంఎస్సీబీ) విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భద్రతా వ్యవస్థ అంధకారంలోకి వెళ్లి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్సిటీ ప్రాంగణంలో రాష్ట్రపతి తన ప్రసంగాన్ని చీకటిలో కొనసాగించాల్సి వచ్చింది. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఆకస్మాత్తుగా తొమ్మిది నిమిషాలు పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భద్రత గార్డులు, సహాయక సిబ్బంది ఒకరికొకరు కానరాని పరిస్థితులు తాండవించాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే పోడియంపై మసకబారిన మిణుగురు కాంతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. అనంతరం ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయం అందం చీకటిమయం అని సుతిమెత్తగా వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ ఘటనపై యూనివర్సిటీ వీసీ సంతోష్ త్రిపాఠి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందే జనరేటర్‌ను మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. సకాలంలో ఎందుకు పని చేయలేదో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంపై విచారణ చేపడతామని తెలియజేశారు. ఇడ్కో ఈ భవనాన్ని నిర్మించింది. జనరేటర్‌కు మరమ్మతులు కూడా చేసింది. ప్రత్యేక జనరేటర్ ఉన్నప్పటికీ అది పనిచేయలేదన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రాథమిక చర్యగా ఈ సంస్థ ఎలక్ట్రికల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. టాటా పవర్‌కు చెందిన హరీష్ కుమార్ పండా మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముందు విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేశామన్నారు. అన్నీ సక్రమంగా పనిచేస్తుండేవని పేర్కొన్నారు. అలాగే బ్యాకప్‌గా అక్కడ ఒక జనరేటర్ సెట్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. టాటా పవర్ నార్తర్న్ ఒడిషా డిస్ట్రిక్ట్ లిమిటెడ్ (టీపీఎన్‌ఓడీఎల్) సీఈవో భాస్కర్ సర్కార్ మాట్లాడుతూ డీజీ సెట్లు నడుస్తున్నాయని, ఏసీలు, మైక్రోఫోన్ పని చేస్తున్నాయని, అయితే భవనం అంతర్గత వైరింగ్ లోపం కారణంగా లైట్లు ఆరిపోయాయని నివేదించారు. విచారణకు ఆదేశం ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా జరిగిన విద్యుత్ వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యూనివర్సిటీ కూడా సమాంతర విచారణ ప్రారంభించింది. పీజీ కౌన్సిల్ చైర్మన్ పి.కె.శతపతి, రిజిస్ట్రార్ సహదేవ్ సమాధియా, డవలప్మెంట్ ఆఫీసర్ బసంత్ మొహంతాతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం లోపాన్ని విచారణ చేపట్టనుంది. విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) సురేష్ దలాసి తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం వెనుక కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుపుతామని బరిపద అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) రుద్ర నారాయణ్ మహంతి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిపిన అనంతరం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) అత్యవసర సమావేశం నిర్వహించారు. -
హైదరాబాద్‌లో కుండపోత.. విద్యుత్ తీగ తెగిపడి కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కుండపోత వానపడింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవగా.. రాత్రి 9 గంటల నుంచి ప్రాంతాల వారీగా భారీ వర్షం పడింది. అర్ధ్థరాత్రి తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. దీనితో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నాలాల వెంబడి వరద ఉధృతంగా ప్రవహించింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక జనం ఆందోళనకు లోనయ్యారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శేరిలింగంపల్లి ఖాజాగూడలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్, సుచిత్ర, సూరారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది. అధికార యంత్రాంగం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. నగరంలో వర్షపాతం ఇలా.. (సెంటీమీటర్లలో) ప్రాంతం వర్షపాతం ఖాజాగూడ 6.3 షేక్‌పేట 5.2 జూబ్లీహిల్స్ 4.6 మాదాపూర్ 4.5 సింగిరేణికాలనీ 4.1 అమీర్‌పేట 4.0 ఎంసీఆర్హెచ్ఆర్డీ 3.8 విద్యుత్ తీగ తెగిపడి కానిస్టేబుల్ మృతి భారీ వర్షం, ఈదురుగాలులతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ ప్రాంతం మీదుగా బైక్‌పై వెళుతున్న గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ వీరాస్వామి (40)పై ఆ తీగలు పడటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో నివసించే సోలెం వీరాస్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9.40 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్తున్నారు. అప్పటికే బలమైన ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలైంది. ఈ సమయంలో విద్యుత్ తీగ తెగి వీరాస్వామిపై పడింది. షాక్‌కు గురైన ఆయన బైక్‌పై నుంచి కిందపడి అపస్మారక స్థితిలో పడిపోయారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ పోలీసులు వీరాస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరాస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం అని.. యూసఫ్‌గూడ బెటాలియన్‌లో మిత్రుడిని కలిసి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారని తెలిసింది. -
దేశవ్యాప్తంగా కరెంట్ బంద్.. ‘చీకటి’లో పాకిస్తాన్ ప్రజలు (ఫోటోలు)
-
అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్ కట్!
ఇస్లామాబాద్: ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు పడింది. అకాశన్నంటిన నిత్యావసరాల ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో కష్టం వచ్చిపడింది. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు సోమవారం అంధకారంలోనే గడిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వత్తులు వెలిగించుకొని జీవనం సాగించారు. నేషనల్ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ పడిపోడవంతో సోమవారం ఉదయం 7:30 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇస్లామాద్, గుజ్రావాలా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా నగరాల్లో కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యత్ శాఖ మంత్రి ఖురాం దస్తగిర్ పేర్కొన్నారు. కరెంటు కోతలు సహజమే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కరెంటు కోతలు సర్వసాధరణమైపోయాయి. హాస్పిటళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్త్నున్నారు. కొన్ని చోట్ల బ్యాటరీతో నడచే లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. గతంలో 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ మొత్తం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఇదే కారణంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లింది. చదవండి: ఆందోళనలతో అట్టుడుకుతున్న బ్రెజిల్, పెరు.. ఏమిటీ సమస్య? -
కరెంటు కట్.. పాకిస్తాన్లో స్తంభించిన విద్యుత్ సరఫరా..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పలు నగరాల్లో సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి కరెంటు సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ మీడియా సంస్ధలు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఆ దేశ విద్యుత్ శాఖ కూడా ట్వీట్ చేసింది. నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోవడం వల్లే విద్యుత్ సరఫరా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని 117 గ్రిడ్ స్టేషన్లు సహా కరాచీ, పేషావర్, బలూచిస్తాన్‌లోని 22 జిల్లాలు విద్యత్ సరఫరా అంతరాయం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2021లో కూడా పాకిస్తాన్లో ఇలాగే జరిగింది. సింధ్ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రంలో సాంకేతిక తప్పిదం కారణంగా ఫ్రీక్వెన్సీ 50 నుంచి సున్నాకు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కరోజు తర్వాత దీన్ని పునరుద్ధరించారు. చదవండి: ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక -
దారుణం: విద్యుత్ నిలిచిపోవడంతో నలుగురు నవజాత శిశువులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదంచోటుచేసుకుంది. సర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అసుపత్రిలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక నలుగురు పసికందులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని మండిపడ్డారు. అయితే విద్యుత్ అంతరాయం కారణంగా పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది బయటపెట్టలేదు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన శిశువు ఒకరోజు నుంచి నలుగురు రోజుల వయసున్న వారని కలెక్టర్ కుందన్ కుమార్ పేర్కొన్నారు. ఆ నలుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచారని, వారిలో ఇద్దరినీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య నలుగురు చిన్నారులు చనిపోయారని ఆయన వెల్లండిచారు. అయితే కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు. చదవండి: బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
సినిమాను మించిన పవన్ ‘పవర్’ డ్రామా
సాక్షి, అమరావతి: తెలంగాణలో తన పర్యటనను ముగించుకుని అకస్మాత్తుగా మంగళగిరికి వచ్చి కరెంట్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి సమీపంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో 5 నిమిషాలపాటు ట్రిప్ అయి కరెంట్‌పోతే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే ఉందని.. పవన్ ‘పవర్’ డ్రామా సినిమాను మించిందని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేశారు. ఫొటోలు తీయండి.. జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద జనరేటర్ ఉన్నప్పటికీ కరెంట్ అంతరాయం వచ్చినప్పుడు ఓ 5 నిమిషాలపాటు దానిని ఆన్ చేయకుండా ఉంచారు. సరిగ్గా ఆ సమయానికి ప్రత్యేకంగా పిలిపించుకున్న కొద్దిమంది విలేకరులకు అదంతా చూపించి ‘ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?’.. అంటూ పవన్ తన డ్రామాను రక్తికట్టించారు. అదే సమయంలో పవన్‌కల్యాణే ‘ఫొటోలు తీయండి’ అంటూ పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. ఇదంతా పూర్తయ్యాక జనరేటర్‌ను ఆన్ చేయించారు. ఆ తర్వాత కరెంట్ వచ్చినప్పటికీ 20 నిమిషాల పాటు కావాలనే జనరేటర్ నడిపించారు. వాస్తవానికి పవర్‌కట్ అయితే 5 నిమిషాలకే తిరిగి కరెంట్ సరఫరా మొదలవదు. కానీ, జనసేన కార్యాలయానికి కరెంట్‌ను సరఫరా చేసే తెనాలి రోడ్డులోని మంగళగిరి 33/11 కేవీ సబ్ స్టేషన్లో ఈదురుగాలులకు రాత్రి 8.30–8.35 మధ్య 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు సబ్‌స్టేషన్ రికార్డుల్లో నమోదైంది. అంటే సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడినట్లు తెలిసిపోతోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన పవన్ అది ముగించుకుని హడావుడిగా మంగళగిరికి బయల్దేరి మధ్యలో కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రమే సా. 5.30కు ఫోన్లుచేసి ‘పవన్‌కల్యాణ్ మీతో ప్రత్యేకంగా మాట్లాడతారు.. 6.30 కల్లా పార్టీ కార్యాలయానికి రావాలి’.. అంటూ సమాచారమిచ్చారు. కానీ, శుక్రవారం ఎంపిక చేసుకున్న విలేకరులకు ఫోన్లుచేసి పిలిపించుకున్నారు. పవర్ కట్ కాదు.. ఫీడర్ ట్రిప్ అయ్యింది విద్యుత్ అంతరాయంపై పవన్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, కోత అనేది అసలు లేనే లేదని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జే పద్మజనార్దనరెడ్డి స్పష్టంచేశారు. ఓవర్ లోడ్‌తో ఫీడర్ ట్రిప్ అయ్యిందని, షిఫ్ట్ ఆపరేటర్ వెంటనే గుర్తించి ఐదు నిమిషాల్లో సరిచేశారని.. 20 నిమిషాలు పట్టిందనడం అవాస్తవమన్నారు. ఇదే అంశంపై ఏపీసీపీడీసీఎల్ మంగళగిరి ఏడీఈ ఏ సత్యనారాయణ కూడా స్పందిస్తూ.. జనసేన కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ కోతలు విధించలేదన్నారు. -
అంధకారంలో లోతట్టు ప్రాంతాలు
సాక్షి, హైదరాబాద్/మల్లాపూర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సబ్‌స్టేషన్లలోకి మంగళవారం వరద నీరు చేరింది. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మల్లాపూర్‌లో కరెంట్ తీగలు తెగిపడి తెనాలికి చెందిన ఫణికుమార్ (35) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నాచారంలోని లిక్కర్స్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఓల్డ్‌సిటీ అంతా అంధకారంలో ఉండిపోయింది. నిమ్స్, మెహిదీపట్నంతో పాటు సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగి వైర్లపై పడగా మరికొన్ని చోట్ల జంపర్లు తెగిపడ్డాయి. ఇన్స్‌లేటర్లు ఫెయిలయ్యాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వైర్లు తెగిపోయాయి. పలు కాలనీలన్నీ రోజంతా అంధకారంలో మగ్గిపోయాయి. కొన్నిచోట్ల వెంటనే సరఫరాను పునరుద్ధరించినప్పటికీ చాలా ప్రాంతాలు చీకట్లోనే ఉండిపోయాయి. వీధుల్లో వరదకు తోడు స్ట్రీట్ లైట్లు కూడా వెలగకపోవడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. హయత్‌నగర్ పరిధిలో 12 సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. రాజేంద్రనగర్, కోఠి ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
స్తంభించిన ముంబై
-
ముంబైలో పవర్ కట్
ముంబై: ముంబై సోమవారం విద్యుత్ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్ జనరేటర్లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది. కాగా, ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ(ఎంఎస్ఈటీసీఎల్)కు చెందిన కల్వా– ఖర్ఘార్ సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్ మంత్రి నితిన్ తెలిపారు. లోడ్ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు. కల్వా సబ్‌స్టేషన్ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్–అప్ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్ డీజిల్ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు. -
అంధకారంలో ముంబై మహానగరం
-
అంధకారంలో ‘మహా’నగరం
ముంబై : విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ముంబై మహానగరంలో సోమవారం అంధకారం అలుముకుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ అంతరాయంతో మెట్రో, సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. మహానగరంలో భారీ స్ధాయిలో విద్యుత్ వ్యవస్థ వైఫల్యం అసాధారణమైనదిగా చెబుతున్నారు. నగరానికి విద్యుత్ సరఫరా వైఫల్యంతో ఈ పరిస్థితి నెలకొందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థ (బెస్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ వైఫల్యంతో ఈ పరిస్థితికి దారితీసిందని పేర్కొంది. ముంబైతో పాటు పరిసర థానే, పాల్ఘడ్,రాయ్‌గఢ్ జిల్లాల్లోను విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు విద్యుత్ వైఫల్యంతో ఆస్పత్రులపై ఎలాంటి ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక నగరంలో చీకట్లు అలుముకోవడంతో ముంబై వాసులు సోషల్ మీడియాలో సంబంధిత అధికారుల తీరును ఎండగట్టారు. విద్యుత్ సరఫరా అందరికీ నిలిచిపోయిందా..? అసలు ముంబైలో ఏం జరుగుతోందని అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ముంబై నగరం అంతటా విద్యుత్ సరఫరా లేదు..దీన్ని ఎవరూ భరించలేరంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. చదవండి : మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు భద్రం #MumbaiPowerCut | Commuters seen waiting at Mulund Station as train services are disrupted due to power outage after a grid failure. (ANI) pic.twitter.com/n10dOY4kOw — HTMumbai (@HTMumbai) October 12, 2020 (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
గాంధీలో విద్యుత్ అంతరాయం
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం సుమారు అరగంటపైగా విద్యుత్ అంతరాయం కలిగింది. అత్యవసర, సాధారణ వార్డుల్లో అంధకారం అలముకోవడంతో కరోనా బాధితులతోపాటు వైద్యులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం జనరేటర్లు ఆన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సాయం త్రం 5.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లు కమ్ముకోవడంతో ఏం జరుగుతుం దో తెలియక రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో సుమా రు 850 మంది ఆక్సిజన్, వెంటిలేటర్లపై వైద్యసేవలు పొందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. స్పం దించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం సంబంధిత ఎలక్ట్రీషియన్లను అప్రమత్తం చేసింది. ఆస్పత్రిలో ఉన్న 500 కేవీ జనరేటర్లను ఆన్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 35 నిమిషాల తర్వాత ఆస్పత్రి మొత్తానికి విద్యుత్ సరఫరా జరిగింది. 11 కేవీ ఫీడర్‌లైన్ ద్వారా ఆస్పత్రి ఎలక్ట్రిసిటీ కంట్రోల్ బోర్డుకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఉదయం నుంచి నిరంతరం కురుస్తున్న వర్షానికి ఫీడర్‌లైన్ జంపర్ హఠాత్తుగా తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా ఓవర్‌లోడ్ పడడంతో ఆటోమేటిక్‌గా ఆన్ కావాల్సిన జనరేటర్లు స్విచ్చాఫ్ అయ్యాయి. గాంధీలో ఆరుగురే కాంట్రాక్టు సిబ్బంది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మొత్తం 21 ఎలక్ట్రీషియన్ పోస్టులు అవసరం కాగా ప్రస్తుతం మూడు షిఫ్ట్‌ల్లో ఆరుగురు కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. వారికి కూడా సంబం ధిత సర్టిఫికెట్, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం గమనార్హం. అంతరాయం 7 నిమిషాలే.. గాంధీ ఆస్పత్రిలో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే విద్యుత్ అంతరాయం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం 5.35 నుంచి 5.56 గంటల వరకు సరఫరా నిలిచిపోయిందని, ఏడు నిమిషాల వ్యవధిలో జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు. ఐసీయూ, అత్యవసర విభాగాలతో పాటు సాధారణ వార్డులో రోగులకు అందిస్తున్న చికిత్సలకు ఎటువంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. -
శభాష్ జగదీశ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మారియెట్ హోటల్లో ప్రారంభమైన రెండు రోజుల్లో కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరెంట్ కోతల గురించి ప్రస్తావించారు. గతంలో ఎండాకాలంలో కోతలుండేవని, ప్రస్తుతం విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో సంబంధింత శాఖ మంత్రి, విద్యుత్‌శాఖాధికారులు కలిసి కృషి చేశారని ప్రశంసించారు. భూసేకరణలోనూ.. దామరచర్లలో నిర్మించతలపెట్టిన 7800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన 10వేల ఎకరాలను సేకరించడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని కూడా కేసీఆర్ అభినందించారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన 10వేల ఎకరాలను సేకరించడంతోపాటు అటవీ భూములకు పరిహారం చెల్లించడంలో పాత కలెక్టర్ చిరంజీవులు, కొత్త కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణలు ఎంతో శ్రమించారని, వారికి ప్రత్యేకంగా అభినందులు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సలో అటు జిల్లా మంత్రికి, ఇటు జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ నుంచి అభినందనలు అందడం విశేషం. -
ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సోమవారం ఉదయం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే మరమ్మతులు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు. -
ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
పరవాడ: విశాఖపట్నంలోని ఎన్టీపీసీ మొదటి యూనిట్లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో బాయిలర్ ట్యూబ్‌లో లీకేజీ ఏర్పడడం వల్ల 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నాటికి విద్యుదుత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. -
‘ఎస్ఎన్సీయూ’లో విద్యుత్ అంతరాయం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో (ఎస్ఎన్సీయూ) ఏర్పడిన విద్యుత్ అంతరాయం చిన్నారులకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల చికిత్స పొందుతున్న చిన్నారులను బయటకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. అనారోగ్యంతో జన్మించిన శిశువుల సంరక్షణార్థం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనిని నివారించటానికి ఎస్ఎన్సీయూని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో మంగళవారం విద్యుత్ సరఫరా చేసే ఇన్వర్టర్లు పాడయ్యాయి. దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లా ఆస్పత్రి టెక్నీషియన్లు మరమ్మతు చేసేందుకు విఫలయత్నం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చికిత్స పొందుతున్న 13 మంది చిన్నారులను బయటకు తరలించాల్సి వచ్చింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అకస్మాత్తుగా ఎస్ఎన్సీయూకి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇన్వర్టర్లలో సమస్య తలె త్తిందని వెంటనే మరమ్మతు చేయిస్తామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 13 మంది శిశువుల్లో 10మంది ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని ఇంటికి తీసుకెళ్లవచ్చని కుటుంబసభ్యులకు చెప్పామన్నారు. అయితే ముగ్గురు చిన్నారుల పరిస్థితి బాగలేకపోవడంతో రిఫర్ చేశామన్నారు. కాగా సాయంత్రం ఇన్వర్టర్లకు మరమ్మతు చేయించి తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.