భువనేశ్వర్: మయూర్‌భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజాదేవ్ (ఎంఎస్‌సీబీ) విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భద్రతా వ్యవస్థ అంధకారంలోకి వెళ్లి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్సిటీ ప్రాంగణంలో రాష్ట్రపతి తన ప్రసంగాన్ని చీకటిలో కొనసాగించాల్సి వచ్చింది. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఆకస్మాత్తుగా తొమ్మిది నిమిషాలు పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భద్రత గార్డులు, సహాయక సిబ్బంది ఒకరికొకరు కానరాని పరిస్థితులు తాండవించాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే పోడియంపై మసకబారిన మిణుగురు కాంతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. అనంతరం ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయం అందం చీకటిమయం అని సుతిమెత్తగా వ్యాఖ్యానించారు.
ఘటనపై విచారణ
ఘటనపై యూనివర్సిటీ వీసీ సంతోష్ త్రిపాఠి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందే జనరేటర్‌ను మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. సకాలంలో ఎందుకు పని చేయలేదో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంపై విచారణ చేపడతామని తెలియజేశారు. ఇడ్కో ఈ భవనాన్ని నిర్మించింది. జనరేటర్‌కు మరమ్మతులు కూడా చేసింది. ప్రత్యేక జనరేటర్ ఉన్నప్పటికీ అది పనిచేయలేదన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రాథమిక చర్యగా ఈ సంస్థ ఎలక్ట్రికల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. టాటా పవర్‌కు చెందిన హరీష్ కుమార్ పండా మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముందు విద్యుత్ కనెక్షన్‌లను తనిఖీ చేశామన్నారు. అన్నీ సక్రమంగా పనిచేస్తుండేవని పేర్కొన్నారు. అలాగే బ్యాకప్‌గా అక్కడ ఒక జనరేటర్ సెట్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. టాటా పవర్ నార్తర్న్ ఒడిషా డిస్ట్రిక్ట్ లిమిటెడ్ (టీపీఎన్‌ఓడీఎల్) సీఈవో భాస్కర్ సర్కార్ మాట్లాడుతూ డీజీ సెట్లు నడుస్తున్నాయని, ఏసీలు, మైక్రోఫోన్ పని చేస్తున్నాయని, అయితే భవనం అంతర్గత వైరింగ్ లోపం కారణంగా లైట్లు ఆరిపోయాయని నివేదించారు.
విచారణకు ఆదేశం
ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా జరిగిన విద్యుత్ వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యూనివర్సిటీ కూడా సమాంతర విచారణ ప్రారంభించింది. పీజీ కౌన్సిల్ చైర్మన్ పి.కె.శతపతి, రిజిస్ట్రార్ సహదేవ్ సమాధియా, డవలప్‌మెంట్ ఆఫీసర్ బసంత్ మొహంతాతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం లోపాన్ని విచారణ చేపట్టనుంది. విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్‌డీసీ) సురేష్ దలాసి తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం వెనుక కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుపుతామని బరిపద అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) రుద్ర నారాయణ్ మహంతి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిపిన అనంతరం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్‌డీసీ) అత్యవసర సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment