పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: ఉరుములు, మెరుపులు, హోరు గాలితో మంగళవారం సాయంత్రం పాల్వంచ మండలంలో వడగళ్ల వాన పడింది. ఇది పడింది కొద్దిసేపే అయినప్పటికీ.. నష్టం మాత్రం తీవ్రంగానే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణం మామూలుగానే ఉంది. అంతలోనే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఆకస్మికంగా ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులతో వడగళ్ల మొదలైంది. దాదాపు అరగంటపాటు పడిన ఈ వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. కరకవాగులో రేకుల ఇల్లు, కిన్నెరసానిలో పూరిపా క కూలిపోయాయి. రాజాపురంలో మొక్కజొన్న ధ్వంసమైంది. మరికొన్ని గ్రామాల్లో మామిడి పూత రాలింది. పత్తి పంట పూర్తిగా తడిచింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
బయ్యారం: మండలంలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. రామచంద్రాపురం, వెంకటాపురం, కంబాలపల్లి గ్రామా ల్లో మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. పత్యాతండా ఐదు పూరిళ్ల పైకప్పులు గాలిదుమారానికి లేచిపోయాయి.
వెంకటాపురం: మండలంలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో 1425 హెక్టార్లలో మిర్చి, దాదాపు వెయ్యి ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పూర్తిగా తడిసింది.
వాజేడు: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లోని వేలాది క్వింటాళ్ల మిర్చి తడిచింది. పంట నష్టం విలువ మొత్తంగా సుమారు 40లక్షల రూపాయలు ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు.
గుండాల: మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల బీభత్సం సృష్టించింది. ఈదరుగాలులతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అనంతోగు పంచాయతీలోని జగ్గుతండా గ్రామంలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో ఐదు పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఈ ఇళ్లలోని దాదాపు 200 క్వింటాళ్ల పత్తి తడిచింది. ఇల్లెందు-గుండాల మార్గంలో మర్రిగూడెం వద్ద రెండు విద్యుత్ స్తంభాంలు కూలిపోయి, తీగలు తెగిపడ్డాయి. కల్లాలోని మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు.
భద్రాచలం రూరల్: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో అరగంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు.
పినపాక: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో కల్లాలోని మిర్చి తడిసింది. మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. సింగిరెడ్డిపల్లి, వెంకట్రావ్‌పేట, పాతరెడ్డిపాలెం, చింతల బయ్యారం, ఏడూళ్ళ బయ్యారం, మల్లారం, టి.కొత్తగూడెం, భూపతిరావుపేట, జానంపేట, భట్టుపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో మిర్చి పంట తడిచింది.
ఇల్లెందు: మండలంలోని చల్లసముంద్రం, రొంపేడు, మాణిక్యారం, కొమరారం, పోలారం పంచాయతీల్లో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో సుమారు 500 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిర్యాలపెంటలో పలువురి గాయాలయ్యాయి.
టేకులపల్లి: మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో రైతులు భీతిల్లారు. గంగారం పంచాయతీలో సుమారు 300 ఎకరాల్లోని మామిడి తోటల్లో ఎక్కువగా పూత, పిందె రాలింది. చింతకాయలు విపరీతంగా నేలరాలాయి. బద్దుతండా, కొప్పురాయి, బోడు, గంగారం గ్రామాల్లో మిర్చి తోటలకు నష్టం వాటిల్లింది.
బర్లగూడెం గ్రామంలో బాలయ్య అనే రైతుకు చెందిన ఎకరన్నర మొక్కజొన్న నీటిపాలైంది. గంగారం పంచాయతీ కార్యాలయం ప్రహరీ కూలింది. ఒక్క గంగారం పంచాయతీలోనే పదికి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల కూడా స్తంభాలు పడిపోయాయి. కొప్పురాయి, బోడు, గంగారం పంచాయతీల్లో వందకు పైగా పూరి గుడిసెలు కూలిపోయాయి. కొన్ని రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
వరుణ దేవా... కరుణ లేదా...
Published Wed, Mar 5 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement