వరంగల్/ జగిత్యాల/ మోత్కూరు/ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు ప్రభావం చూపించాయి. శనివారం వివిధ జిల్లాల పరిధిలో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షం తక్కువే కురిసినా.. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
వరంగల్‌లో అతలాకుతలం..
శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఓ జిన్నింగ్ మిల్లు రేకులు లేచిపోయాయి.
హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేటలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి, లెంకాలపల్లి, నందిగామ, రేలకుంట, రు ద్రగూడెం, శనిగరం గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
జగిత్యాల, యాదాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో..
జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. మినీస్టేడియం గోడ కూలిపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భోజ్యనాయక్‌తండాకు చెందిన బానోతు సుమన్ పిడుగుపాటుతో మృతిచెందగా.. బానోతు భద్రు, బానోతు రమ, అజ్మీరా శశిరేఖలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేటలో మేకల కాప రి క్యాతం రాజయ్య (65) పిడుగుపాటుకు మృతిచెందాడు. బుగ్గారం మండలం సిరికొండలో పిడుగుపడి మరో మేకలకాపరి మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment