అనసూయమ్మ మృతదేహం
కూలీ బతుకులపై పిడుగు
Published Sun, Jul 31 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
♦ పిడుగుపాటుకు గురై ఇద్దరి మహిళల మృతి
♦ అపస్మారక స్థితిలో ఉన్న మరొక మహిళ
బూర్జ/సరుబుజ్జిలి(ఆమదాలవలస రూరల్): ఆమదాలవలస నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో శనివారం సాయంత్రం పొలం పనులు చేస్తున్న వీరిని పిడుగులు బలి తీసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి. బూర్జ మండలంలోని ఏ.పి.పేట(అప్పలపేట) గ్రామానికి సమీపంలోని పొలాల్లో శనివారం సాయంత్రం పిడుగుపడడంతో గ్రామానికి చెందిన రేవాడ చిన్నమ్మడు(45) మృతి చెందింది. మరొక మహిళ నట్ల చిన్నమ్మడు అపస్మారక స్థితిలో ఉంది.
ఆ గ్రామానికి చెందిన 15 మంది ఒక పొలంలో వరి నాట్లు వేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భయంకరమైన శబ్ధంతో కూడిన పిడుగు పడటంతో వారందరూ చెల్లా చెదురయ్యారు. ఇద్దరు మాత్రం అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే స్థానికులు వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవాడ చిన్నమ్మడు మృతి చెందింది. ఆమె మృతితో భర్త, కుమార్తె, బంధువులు ఆస్పత్రిలో భోరున విలపిస్తున్నారు. నట్ల చిన్నమ్మడు పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఇద్దరి కుటుంబాలు నిరుపేదలు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.
పొలంకెళ్లి తిరిగివస్తూ....
సరుబుజ్జిలి మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన బురిడి అనసూయమ్మ(50) పిడుగుపాటుకుగురై మృతి చెందింది. స్థానికులు చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పొలంలో కలుపుతీతకు వెళ్లి తిరిగివస్తున్న తరుణంలో గ్రామానికి సమీపంలోని కోనేరు గట్టువద్ద పిడుగుపాటుకు గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త సత్యం, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనసూయమ్మ హఠాన్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబాన్ని సర్పంచ్ మునకాల సూర్యారావు పరామర్శించి ప్రభుత్వం నుంచి సహాయంకు కృషిచేస్తానని చెప్పారు.
Advertisement
Advertisement