ఐదు రోజులు ఇదే పరిస్థితి
మూడు రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం (అగ్రికల్చర్): రాష్ట్రంలో పిడుగులు మోత మోగించనున్నాయి. రానున్న ఐదు రోజులు ఇవి దడ పుట్టించనున్నాయి. రెండు మూడు మినహా మిగిలిన జిల్లాల్లో పిడుగులు ప్రభావం చూపనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1, 5.8 కి.మీ. మధ్య ఉన్న గాలుల కోత, షీర్ జోన్ కొనసాగుతున్నాయి.
ఫలితంగా బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో వానలు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయంది.
‘అనంత’లో వర్షాలు
జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఉరవకొండలో 29.6 మి.మీ, పామిడిలో 20.4 మి.మీ, వజ్రకరూరులో 20.2 మి.మీ, గార్లదిన్నెలో 20 మి.మీ. చొప్పున వర్షపాతాలు నమోదయ్యాయి. పెద్దవడుగూరు, శింగనమల, గుంతకల్లు, యాడికి, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, రాయదుర్గం, అనంతపురం, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, నార్పల తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment