శంకర్‌పల్లి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలచోట్ల చెట్లు విరిగి పోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు పూర్తిగా నేలరాలయి. చాలా మంది ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. సుమారు రెండు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం అధికారులు సరఫరాను పునరుద్ధరించారు.
తడిసిపోయిన ధాన్యం బస్తాలు
తాండూరు: తాండూరులో అకాల వర్షం హడలెత్తించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత జోరుగా వర్షం కురిసింది. గాలిదుమారంతో మొదలై మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి జరిగిన భారీ నష్టం దృష్ట్యా యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఈసారి ధాన్యం బస్తాలు తక్కువగా తడిసాయి. ఈసారి కొనుగోలుదారుల బస్తాలు వర్షంతో తడిసిపోయాయి. వరి ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యాన్ని యార్డులో మంగళవారం ఉదయం లారీల్లో కొనుగోలుదారులు తరలించారు. కొందరు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు.
దెబ్బతిన్న ఇళ్లు
మొయినాబాద్: ఈదురు గాలులు, హోరువాన బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్థరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కేతిరెడ్డిపల్లిలో ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. అప్పోజిగూడలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్లు విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామాల్లో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమ్డాపూర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్‌లో శంషాబాద్ మండలంలోని రాయన్నగూడ చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభం విరిగి పడటంతో సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం వరకు పునరుద్ధరించలేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని అమ్డాపూర్, బాకారం, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెరువుల్లోకి చేరిన నీరు
కందుకూరు: మండల పరిధిలో సోమవారం రాత్రి 46.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కుంటలు, చెక్‌డ్యాంలు, రహదారుల వెంబడి గుంతల్లో నీరు నిలిచింది. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి స్వల్పంగా నీరు చేరింది. ఓ మోస్తరు వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉక్కపోతతో అల్లాడిన జనం
చేవెళ్లరూరల్: మండలంలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌వైర్లు తెగిపడ్డాయి. మంగళవారం ఉదయం వరకూ గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. పంటలకు నష్టం వాటిల్లింది.
నేలకొరిగిన చెట్లు
పూడూరు: మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బలమైన ఈదురు గాలులతో వర్షం కురవడంతో రాకంచర్ల గ్రామానికి చెందిన జంగయ్య పొలంలోని పెద్ద తుమ్మ చెట్టు విరిగిపడింది. పక్కనే విద్యుత్ వైర్లపై పడటంతో తీగల తెగిపడ్డాయి. కెరవెళ్లి, సిరిగాయపల్లి, సోమన్‌గుర్తి, కంకల్, మంచన్‌పల్లి గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రైతుకు అపార నష్టం
గండేడ్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోవువారం రాత్రి కురిసిన గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ట్రాన్స్‌ఫార్మర్లతో సహా కిందపడిపోయాయి. కూరగాయల తోటలు, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని నంచర్ల, జిన్నారం, జక్లపల్లి, జిన్నారం తండా, సాలార్‌నగర్ గ్రామాల్లో ఇళ్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోయింది. నంచర్ల, గండేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోయింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం..
వికారాబాద్/ ఆలంపల్లి: డివిజన్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు మార్గాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు, బంట్వారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలి వానకు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి సంబంధించిన స్తంభాలు పడి పోయాయి.
దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో రాత్రంతా రోగులు చీకట్లో ఇబ్బందులు పడుతూ గడిపారు. మంగళవారం ఉదయం విద్యుత్ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. మండలంలో అక్కడక్కడా చెట్లు విరిగిపోయాయి. గాలి వానతో మామిడికాయలు నేలరాలాయి. పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి.