Grain bags
-
రోడ్లపై ధాన్యం నిల్వలు, ప్రమాదాల భారిన వాహనాలు
-
9వేల బస్తాల ధాన్యం పట్టివేత
మక్తల్: ఎలాంటి అను మతి లేకుండా కర్ణాటక నుంచి తెలంగాణకు ఒకేసారి 16 లారీలలో తీసుకువ స్తున్న సుమారు తొమ్మిది వేల ధాన్యం బస్తాలను మక్తల్ పోలీసు లు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి సిర్పూర్, సిర్వార్, మాన్వే, రాయచూర్ నుంచి ధాన్యం లోడుతో ఈ లారీలు ఆదివారం తెల్లవారుజామున వస్తుండగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సీఐ సీతయ్య, ఎస్ఐ రాములు పట్టుకున్నారు. ఒక్కో లారీలో 500 నుంచి 800 వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా నల్లగొండ నుంచి కర్ణాటక రాష్ట్రానికి సిమెంట్ తీసుకుని వెళ్లామని.. తిరుగు ప్రయాణంలో కొందరు వ్యక్తులతో మాట్లాడుకుని ధాన్యం లోడ్ తీసుకువస్తున్నామని లారీ డ్రైవర్లు చెప్పడం గమనార్హం. సరిహద్దు చెక్‌పోస్టు ఎలా దాటారు! నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద సరిహద్దు చెక్‌పోస్టు ఉన్నా ఈ లారీలను పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో ధాన్యం రేటు ఎక్కువగా ఉండటంతో కర్ణాటకలో దళారుల నుంచి కొని.. కొందరు పెద్దల సహకారంతో ఇలా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆశలు లాక్‘డౌన్’
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను సమకూర్చడంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేతులెత్తేసింది. జనపనారతో తయారుచేసే గోనె సంచుల మిల్లులను లాక్డౌన్ గడువుకు ముందే తిరిగి ఆరంభించడానికి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మన రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది. దీంతో అప్రమత్తమైన పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలోని రేషన్‌డీలర్లు, రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న పాత గోనె సంచులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ఒక్క గోనె సంచి కూడా బయటకు వెళ్లకుండా యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్రాల వినతులకు బెంగాల్ ‘నో’ జనపనార బస్తాల కొరతతో రైతుల ఉత్పత్తుల సేకరణ దెబ్బతింటోందని, కాబట్టి సంచులు సమకూర్చాలని తెలంగాణ, పంజాబ్‌తో పాటు కేంద్ర ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) కొన్నిరోజులుగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీతో పాటు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతోనూ మాట్లాడారు. కేంద్ర జౌళి శాఖ సైతం మిల్లులు పనిచేయడానికి అనుమతించాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది. పశ్చిమబెంగాల్లో 60 జనపనార మిల్లులు ఉండగా, అక్కడి నుంచే దేశానికి అవసరమైన 80శాతం సంచుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ మిల్లుల్లో 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ సీజన్ మొదలైంది. ప్రస్తుత సీజన్లో ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను తరలించేందుకు భారీగా సంచులు అవసరం. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బియ్యం, గోధుమలు, కందిపప్పు సరఫరా చేయాలంటే కనీసం 20లక్షల బేళ్లు (సుమారు 100 కోట్ల సంచులు) ఈ ఏడాది అక్టోబర్ వరకు అవసరమని, ఈ దృష్ట్యా తయారీని ఆరంభించాలని ఈనెల 3న పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. ఇక తెలంగాణలో గతేడాది 47లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణకు కొత్తగా 12కోట్ల సంచులు సమకూర్చుకుంది. ఈ ఏడాది కోటి టన్నుల మేర సేకరణ ఉండటంతో 20కోట్ల సంచులు అవసరమని గుర్తించింది. ఇప్పటికే ఒకసారి వినియోగించిన సంచులు కొంతమేర లభ్యతలో ఉన్నాయి. ఇవి 35 నుంచి 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోతాయి. కొత్తగా కనీసం 7 కోట్ల సంచులు అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేయగా, వీటిని అందించేలా ఉత్పత్తిని ఆరంభించి సరఫరా చేయాలని ప్రభుత్వం బెంగాల్‌ను కోరింది. మిల్లులు తెరిచేందుకు అవసరమైన అనుమతులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇస్తే తప్ప తెరిపించలేమని ఆ రాష్ట్ర సీఎస్ రాజీవ్ సిన్హా ప్రకటించారు. సంచుల సేకరణకు నిర్ణయం: బెంగాల్ ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. సమస్యను అధిగమించేందుకు రైస్ మిల్లర్లు, డీలర్ల దగ్గర ఉన్న పాత సంచులను తక్షణమే ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని, పాత సంచుల సరఫరాదారుల నుంచి సేకరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. వీటి స్టోరేజీ సమస్య రాకుండా సంచులను కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేయాలన్నారు. ధాన్యం సేకరణకు రూ.25వేల కోట్లు సమకూర్చినందున రవాణా కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, డీలర్లకు తక్షణమే చెల్లింపులు చేయాలన్నారు. డీలర్ల నుంచి తీసుకునే సంచులకు ఒక్కో సంచి ధర రూ.16 ఉండగా,దాన్ని రూ.18కి పెంచినట్లు వెల్లడించారు. ఏప్రిల్ నెల రేషన్‌కు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వడంతో డీలర్ల వద్ద దాదాపు 60లక్షల గోనె సంచులున్నాయని, వీటిని సేకరించాలని సూచించారు. సంచుల సేకరణ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. -
రోడ్డుపై పడ్డ ధాన్యం బస్తాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : పరిమితికి మించి ధాన్యం బస్తాలను లోడ్ చేసుకుని వెళ్తున్న ఓ లారీ నుంచి బస్తాలు రోడ్డుపై జారీ పడ్డాయి. బుధవారం ఉదయం దాస్‌నగర్ మీదుగా వెళ్తున్న ఈ లారీ నగర శివారులోని ముబారక్‌నగర్ వద్దకు రాగానే ఒక్కసారిగా 30 బస్తాల వరకు కింద పడ్డాయి. ఆ సమయంలో లారీ వెనుకాల ఇతర ఏ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం వరకు బస్తాలు అలాగే ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఓవర్ లోడ్‌తో ధాన్యం బస్తాలను నింపడం మూలంగానే లారీలోంచి పడిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్‌లోడ్‌తో ఇటీవల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా... ఆర్టీఏ అధికారులు అధిక ధాన్యం బస్తాలతో రవాణా చేస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
16 వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయం
జగిత్యాల: ప్రభుత్వ సొమ్ము మాయం కావడం సాధారణం. కాకపోతే ఈసారి జగిత్యాలలో ఏకంగా వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయమైంది. స్థానిక మండలంలోని తాటిపల్లి శివారులోని శ్రీ రాజరాజేశ్వర రైస్‌మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వ ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన 22 వేల బస్తాల ధాన్యం మిల్లులో ఉండాల్సింది కానీ.. ప్రస్తుతం మిల్లులో కేవలం 6 వేల బస్తాల ధాన్యం మాత్రమే ఉన్నాయి. కోటి రూపాయల విలువైన 16 వేల బస్తాల ధాన్యం మాయం కావడం పై అధికారులు విచారణ చేపడుతున్నారు. -
గాలివాన బీభత్సం
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలచోట్ల చెట్లు విరిగి పోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు పూర్తిగా నేలరాలయి. చాలా మంది ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. సుమారు రెండు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం అధికారులు సరఫరాను పునరుద్ధరించారు. తడిసిపోయిన ధాన్యం బస్తాలు తాండూరు: తాండూరులో అకాల వర్షం హడలెత్తించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత జోరుగా వర్షం కురిసింది. గాలిదుమారంతో మొదలై మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి జరిగిన భారీ నష్టం దృష్ట్యా యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఈసారి ధాన్యం బస్తాలు తక్కువగా తడిసాయి. ఈసారి కొనుగోలుదారుల బస్తాలు వర్షంతో తడిసిపోయాయి. వరి ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యాన్ని యార్డులో మంగళవారం ఉదయం లారీల్లో కొనుగోలుదారులు తరలించారు. కొందరు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. దెబ్బతిన్న ఇళ్లు మొయినాబాద్: ఈదురు గాలులు, హోరువాన బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్థరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కేతిరెడ్డిపల్లిలో ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. అప్పోజిగూడలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్లు విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామాల్లో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమ్డాపూర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్లో శంషాబాద్ మండలంలోని రాయన్నగూడ చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభం విరిగి పడటంతో సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం వరకు పునరుద్ధరించలేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని అమ్డాపూర్, బాకారం, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువుల్లోకి చేరిన నీరు కందుకూరు: మండల పరిధిలో సోమవారం రాత్రి 46.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కుంటలు, చెక్‌డ్యాంలు, రహదారుల వెంబడి గుంతల్లో నీరు నిలిచింది. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి స్వల్పంగా నీరు చేరింది. ఓ మోస్తరు వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడిన జనం చేవెళ్లరూరల్: మండలంలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌వైర్లు తెగిపడ్డాయి. మంగళవారం ఉదయం వరకూ గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. పంటలకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన చెట్లు పూడూరు: మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బలమైన ఈదురు గాలులతో వర్షం కురవడంతో రాకంచర్ల గ్రామానికి చెందిన జంగయ్య పొలంలోని పెద్ద తుమ్మ చెట్టు విరిగిపడింది. పక్కనే విద్యుత్ వైర్లపై పడటంతో తీగల తెగిపడ్డాయి. కెరవెళ్లి, సిరిగాయపల్లి, సోమన్గుర్తి, కంకల్, మంచన్‌పల్లి గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుకు అపార నష్టం గండేడ్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోవువారం రాత్రి కురిసిన గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ట్రాన్స్ఫార్మర్లతో సహా కిందపడిపోయాయి. కూరగాయల తోటలు, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని నంచర్ల, జిన్నారం, జక్లపల్లి, జిన్నారం తండా, సాలార్‌నగర్ గ్రామాల్లో ఇళ్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోయింది. నంచర్ల, గండేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. వికారాబాద్/ ఆలంపల్లి: డివిజన్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు మార్గాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు, బంట్వారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలి వానకు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి సంబంధించిన స్తంభాలు పడి పోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో రాత్రంతా రోగులు చీకట్లో ఇబ్బందులు పడుతూ గడిపారు. మంగళవారం ఉదయం విద్యుత్ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. మండలంలో అక్కడక్కడా చెట్లు విరిగిపోయాయి. గాలి వానతో మామిడికాయలు నేలరాలాయి. పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి.