Shankar Palli
-
కోటి సుపారీ: ‘హత్యకు కుట్ర.. అతనిపైనే అనుమానం’
ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సామ దామోదర్‌రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి.. 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని.. దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరిందని వీడియో పంపించారు. బీహారీ గ్యాంగ్ క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు ఓ దుండగుడు దామోదర్‌రెడ్డికి పంపించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో దామోదర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీవన్‌రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమి షయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు -
విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. నవవధువు గల్లంతు
మర్పల్లి, శంకర్పల్లి, నవాబుపేట: వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు వ్యక్తులు వరద ఉధృతిలో గల్లంతయ్యారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో గత శుక్రవారం వివాహం జరిగింది. ఆదివారం విందు కోసం మోమిన్‌పేట వెళ్లిన వధువు బంధువులు సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. మధ్యలో తిమ్మాపూర్ సమీపంలోని వాగు దాటేక్రమంలో ప్రవాహ తీవ్రతను అంచనా వేయని డ్రైవర్ కారును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. బయటపడిన వరుడు, సోదరి దీంతో వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇందులో వధువు, వరుడితో పాటు పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఓ చిన్నారి, డ్రైవర్ ఉన్నారు. వరదలో గల్లంతైన వారిలో వరుడు, ఆయన సోదరి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. మరో సంఘటనలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని వాగులో కారు గల్లంతైంది. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన సాయి, వినోద్, రమేశ్, శ్రీనివాస్, వెంకటయ్య కలసి పని నిమిత్తం ఎన్కేపల్లికి వచ్చి తిరిగి కౌకుంట్లకు వెళుతుండగా వాగులో వీరి వాహనం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు బయటపడగా.. వెంకటయ్య(75) గల్లంతయ్యాడు. అంత్యక్రియలకు వెళ్లివస్తూ.. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులిమామిడి వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ భార్యతో కలసి ఆదివారం ఉదయం బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంగారెడ్డి వెళ్లాడు. సాయం త్రం 7 గంటలకు గ్రామం వద్దకు చేరుకోగా ఊరు శివారులో ని వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో భార్య నాగరాణిని ఒడ్డుపై దింపి శ్రీనివాస్ వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వరద ఉధృతితో అతను బైక్‌తో పాటు కొట్టుకుపోయాడు. కళ్లెదుటే కొట్టుకుపోతున్న భర్తను చూసిన నాగరాణి కాపాడమంటూ గట్టిగా అరిచినా, వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయోజనం లేకుండాపోయింది. కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు గంటకుపైగా.. చండూరు: నల్లగొండ జిల్లా చం డూరు మండలం శిర్దేపల్లి వాగులో ఆదివారం రాత్రి దయానంద్, శ్రీను, కిరణ్ అనే ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. గంటకుపైగా నీటిలోనే ఉండిపోయిన వారిని స్థానికులు, పోలీసులు రక్షించారు. -
శంకర్ పల్లికి భారీగా పెట్టుబడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ‘జిల్లాకు రూ.800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. జిల్లా ఫార్మా, ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలకు నెలవుగా మారనుంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఘనత సాధించింది. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హార్డ్‌వేర్ పార్కులతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీలు, పర్యాటకరంగాలకు కేంద్ర బిందువుగా రంగారెడ్డి జిల్లా మారింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్స్టైల్ పరిశ్రమ రైలు కోచ్‌లు, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.800 కోట్ల పెట్టుబడితో శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో తమ యూనిట్‌ను నెలకొల్పనున్నది. ఇందుకోసం 2017లోనే ప్రభుత్వంతో మేధా ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఎస్ఐఐసీ వంద ఎకరాల భూ సేకరణ చేపట్టింది’ అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియా పోస్టు; గీత దాటితే చర్యలు తప్పవు! -
అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి హత్య
-
రిసార్ట్‌లో దారుణం: అత్యాచారం చేసి.. ఆపై గొంతుకోసి
సాక్షి, శంకర్పల్లి : రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి రిసార్ట్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు డిగ్రీ విద్యార్థిని దారుణంగా కొంతు కోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా శిరీష అనే డిగ్రీ విద్యార్థి శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సాయిప్రసాద్ ఈ దారుణానికి పాల్పాడ్డారు. గత కొంతకాలంగా శిరీష, సాయి ప్రసాద్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. శిరీషపై కోపం పెంచుకున్న సాయిప్రసాద్ పథకం ప్రకారం, మాట్లకుందాం రమ్మంటూ ఆమెను ప్రగతి రిసార్ట్‌కు పిలిచాడు. రిసార్ట్‌లో కాటేజీ బుక్ చేసుకొని ఏకాంతంగా గడిపినట్టు సమాచారం. అనంతరం యువకుడి గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను మోసం చేస్తోందని ఆవేశంగా ఉన్న సాయిప్రసాద్ శిరీష గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్య విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన రిసార్ట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కానీ హత్య మధ్యాహ్నం 2 గంటలకు జరిగితే, రాత్రి 11 గంటలకు తల్లిదండ్రులకు విషయం తెలియచేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు శిరీష మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని శిరీష మృతదేహంతో రిసార్ట్ ముందు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో నిందితుడు సాయిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నేడు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పెళ్లి కాని వారిని ఎలా అనుమతిస్తారు: శిరీష తండ్రి ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఈశ్వర్ స్పందింస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. పెళ్లి కాని వారిని రిసార్ట్‌లోకి ఎలా అనుమతిస్తారంటూ నిలదీశారు.రిసార్ట్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘పస్తులే’ ప్రత్యామ్నాయం..!
శంకర్పల్లి: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకుతోడు కరెంట్ కోతలతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపై సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. వీటికి తోడు బియ్యం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దినసరి కూలీలు కనీసం కూరగాయల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు అలుగడ్డ, ఉలిగడ్డ తదితర కూరగాయలను బ్లాక్ చేయడంతో ధరలు మరింత రెట్టింపవుతున్నాయి. పది రోజుల క్రితం పాలకూర, కొత్తిమీర మూడు కట్టలు ఉంటే ఇప్పుడు రూ. 10కి కూడా ఒక కట్ట దొరకని పరిస్థితి. దీంతో కొందరు పచ్చళ్లతో కాలం వెళ్లదీస్తుండగా మరికొందరు కారం మెతకులతోనే కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక కొందరు కూలీలైతే ఈ ధరలకు తాము ఏమీ కొనలేమని, పస్తులుండటమే ప్రత్యామ్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాటెక్కిన పచ్చి మిర్చి అన్ని కూరగాయల్లోకెల్లా పచ్చి మిర్చిధర అమాంతం పెరిగింది. 10 రోజుల క్రితం రూ.30 ఉన్న కిలో పచ్చిమిర్చి ధర ఇప్పుడు రూ.80కు అమ్ముతున్నారు. దీంతో మిర్చి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. రూ. 300 తీసుకెళితే కనీసం వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని కొందరు వాపోతున్నారు. ధరలు మళ్లీ తగ్గే వరకు కూరగాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. -
గాలివాన బీభత్సం
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలచోట్ల చెట్లు విరిగి పోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు పూర్తిగా నేలరాలయి. చాలా మంది ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. సుమారు రెండు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం అధికారులు సరఫరాను పునరుద్ధరించారు. తడిసిపోయిన ధాన్యం బస్తాలు తాండూరు: తాండూరులో అకాల వర్షం హడలెత్తించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత జోరుగా వర్షం కురిసింది. గాలిదుమారంతో మొదలై మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి జరిగిన భారీ నష్టం దృష్ట్యా యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఈసారి ధాన్యం బస్తాలు తక్కువగా తడిసాయి. ఈసారి కొనుగోలుదారుల బస్తాలు వర్షంతో తడిసిపోయాయి. వరి ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యాన్ని యార్డులో మంగళవారం ఉదయం లారీల్లో కొనుగోలుదారులు తరలించారు. కొందరు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. దెబ్బతిన్న ఇళ్లు మొయినాబాద్: ఈదురు గాలులు, హోరువాన బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్థరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కేతిరెడ్డిపల్లిలో ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. అప్పోజిగూడలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్లు విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామాల్లో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమ్డాపూర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్లో శంషాబాద్ మండలంలోని రాయన్నగూడ చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభం విరిగి పడటంతో సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం వరకు పునరుద్ధరించలేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని అమ్డాపూర్, బాకారం, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువుల్లోకి చేరిన నీరు కందుకూరు: మండల పరిధిలో సోమవారం రాత్రి 46.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కుంటలు, చెక్‌డ్యాంలు, రహదారుల వెంబడి గుంతల్లో నీరు నిలిచింది. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి స్వల్పంగా నీరు చేరింది. ఓ మోస్తరు వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడిన జనం చేవెళ్లరూరల్: మండలంలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌వైర్లు తెగిపడ్డాయి. మంగళవారం ఉదయం వరకూ గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. పంటలకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన చెట్లు పూడూరు: మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బలమైన ఈదురు గాలులతో వర్షం కురవడంతో రాకంచర్ల గ్రామానికి చెందిన జంగయ్య పొలంలోని పెద్ద తుమ్మ చెట్టు విరిగిపడింది. పక్కనే విద్యుత్ వైర్లపై పడటంతో తీగల తెగిపడ్డాయి. కెరవెళ్లి, సిరిగాయపల్లి, సోమన్గుర్తి, కంకల్, మంచన్‌పల్లి గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుకు అపార నష్టం గండేడ్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోవువారం రాత్రి కురిసిన గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ట్రాన్స్ఫార్మర్లతో సహా కిందపడిపోయాయి. కూరగాయల తోటలు, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని నంచర్ల, జిన్నారం, జక్లపల్లి, జిన్నారం తండా, సాలార్‌నగర్ గ్రామాల్లో ఇళ్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోయింది. నంచర్ల, గండేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. వికారాబాద్/ ఆలంపల్లి: డివిజన్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు మార్గాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు, బంట్వారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలి వానకు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి సంబంధించిన స్తంభాలు పడి పోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో రాత్రంతా రోగులు చీకట్లో ఇబ్బందులు పడుతూ గడిపారు. మంగళవారం ఉదయం విద్యుత్ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. మండలంలో అక్కడక్కడా చెట్లు విరిగిపోయాయి. గాలి వానతో మామిడికాయలు నేలరాలాయి. పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి.