కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకుతోడు కరెంట్ కోతలతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది.
శంకర్‌పల్లి: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకుతోడు కరెంట్ కోతలతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపై సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. వీటికి తోడు బియ్యం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
దినసరి కూలీలు కనీసం కూరగాయల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు అలుగడ్డ, ఉలిగడ్డ తదితర కూరగాయలను బ్లాక్ చేయడంతో ధరలు మరింత రెట్టింపవుతున్నాయి. పది రోజుల క్రితం పాలకూర, కొత్తిమీర మూడు కట్టలు ఉంటే ఇప్పుడు రూ. 10కి కూడా ఒక కట్ట దొరకని పరిస్థితి. దీంతో కొందరు పచ్చళ్లతో కాలం వెళ్లదీస్తుండగా మరికొందరు కారం మెతకులతోనే కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక కొందరు కూలీలైతే ఈ ధరలకు తాము ఏమీ కొనలేమని, పస్తులుండటమే ప్రత్యామ్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘాటెక్కిన పచ్చి మిర్చి
అన్ని కూరగాయల్లోకెల్లా పచ్చి మిర్చిధర అమాంతం పెరిగింది. 10 రోజుల క్రితం రూ.30 ఉన్న కిలో పచ్చిమిర్చి ధర ఇప్పుడు రూ.80కు అమ్ముతున్నారు. దీంతో మిర్చి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. రూ. 300 తీసుకెళితే కనీసం వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని కొందరు వాపోతున్నారు. ధరలు మళ్లీ తగ్గే వరకు కూరగాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు.