విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. నవవధువు గల్లంతు | New bride Washed away flood water | Sakshi
Sakshi News home page

విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. నవవధువు గల్లంతు

Published Mon, Aug 30 2021 1:58 AM | Last Updated on Mon, Aug 30 2021 9:09 AM

New bride Washed away flood water - Sakshi

మర్పల్లి, శంకర్‌పల్లి, నవాబుపేట: వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు వ్యక్తులు వరద ఉధృతిలో గల్లంతయ్యారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో గత శుక్రవారం వివాహం జరిగింది. ఆదివారం విందు కోసం మోమిన్‌పేట వెళ్లిన వధువు బంధువులు సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. మధ్యలో తిమ్మాపూర్‌ సమీపంలోని వాగు దాటేక్రమంలో ప్రవాహ తీవ్రతను అంచనా వేయని డ్రైవర్‌ కారును అలాగే ముందుకు తీసుకెళ్లాడు.


                                బయటపడిన వరుడు, సోదరి

దీంతో వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇందులో వధువు, వరుడితో పాటు పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఓ చిన్నారి, డ్రైవర్‌ ఉన్నారు. వరదలో గల్లంతైన వారిలో వరుడు, ఆయన సోదరి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు.  మరో సంఘటనలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని వాగులో కారు గల్లంతైంది. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన సాయి, వినోద్, రమేశ్, శ్రీనివాస్, వెంకటయ్య కలసి పని నిమిత్తం ఎన్కేపల్లికి వచ్చి తిరిగి కౌకుంట్లకు వెళుతుండగా వాగులో వీరి వాహనం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు బయటపడగా.. వెంకటయ్య(75) గల్లంతయ్యాడు.  

అంత్యక్రియలకు వెళ్లివస్తూ.. 
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం పులిమామిడి వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్‌ భార్యతో కలసి ఆదివారం ఉదయం బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంగారెడ్డి వెళ్లాడు. సాయం త్రం 7 గంటలకు గ్రామం వద్దకు చేరుకోగా ఊరు శివారులో ని వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో భార్య నాగరాణిని ఒడ్డుపై దింపి శ్రీనివాస్‌ వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వరద ఉధృతితో అతను బైక్‌తో పాటు కొట్టుకుపోయాడు. కళ్లెదుటే కొట్టుకుపోతున్న భర్తను చూసిన నాగరాణి కాపాడమంటూ గట్టిగా అరిచినా, వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయోజనం లేకుండాపోయింది.  
కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు  

గంటకుపైగా.. 
చండూరు: నల్లగొండ జిల్లా చం డూరు మండలం  శిర్దేపల్లి వాగులో ఆదివారం రాత్రి దయానంద్, శ్రీను, కిరణ్‌ అనే ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. గంటకుపైగా నీటిలోనే ఉండిపోయిన వారిని స్థానికులు, పోలీసులు రక్షించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement