సాక్షి, నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన ప్రభావంగా జిల్లాలో రెండు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం ఆదివారం రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. జిల్లాలో ఆదివారం సాయంత్రానికి సగటున 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులు తోడయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరులో పిడుగుపడి ఓ ఇల్లు కాలిపోగా, కావలి పట్టణంలోని దారావారివీధి, వెంగళ్‌రావునగర్‌లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలోని పలు ఇళ్లల్లో టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. వాకాడులో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.
జిల్లా వ్యాప్తంగా పలు చెరువులకు కొంత మేర నీరు చేరింది. పంట పొలాలు నీటమునిగాయి. నెల్లూరు నగరంలోని పలు ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని లోతట్టు కాలనీలు సైతం నీటి మునిగిపోవడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరులో పిడుగుపడి ఏనుగేటి పెంచలయ్యకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సుమారు రూ. 20 వేలు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కావలిలో భారీ వర్షంతో పాటు దారావారివీధి, వెంగళరావునగర్‌లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. వెంగళరావునగర్‌లోని శ్రీను బాషాకు చెందిన మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంటి పైభాగం దెబ్బతినగా ఆ వీధిలోని సుమారు 50 టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటిలో పంట పొలాలు మునిగాయి. నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాల పరిధిలో భారీ వర్షం కురిసింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నగరంలో వనంతోపు, కొత్తూరు, చంద్రబాబు కాలనీ, బాబూ జగ్జీవన్‌రామ్‌కాలనీ, టైలర్స్ కాలనీ, గాంధీబొమ్మ, లీలామహల్, సండేమార్కెట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జి, నిప్పోసెంటర్, కిషోర్‌కాలనీ, బట్వాడిపాళెం తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రొట్టెల పండగకు వచ్చిన భక్తులు సైతం వర్షం దెబ్బకు మరింత ఇబ్బందుల పాలయ్యారు.
బోగోలు మండలం పాతకడపాళెం తీరానున్న సముద్రజలాల్లో ప్రకాశం జిల్లా కరేడు, పాతకడపాళెం మత్స్యకారులకు చెందిన రెండు బోట్లు చిక్కుకున్నాయి. ఆ బోట్లలో 12 మంది మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సముద్ర జలాల నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోస్టుగార్డు సిబ్బంది సహాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క భారీ వర్షం కురుస్తుంది. సముద్ర జలాలు ఎగిసి పడుతు న్నాయి. ఆత్మకూరులోనూ భారీవర్షం కురిసింది. అయితే పంట నష్టం లేదు. వరినాట్లకు వర్షం ఉపయోగకరం. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లిగూడూరులో నారుమళ్లు మునిగాయి. పొదలకూరులో నెల్లూరురూరల్ మండలం ఆమంచర్ల వద్ద 33 కేవీ లైన్ విద్యుత్ వైరుపై జామాయిల్ కొమ్మలు పడి విద్యుత్ సరఫరా మధ్యాహ్నం వరకు నిలిచి పోయింది.
విద్యుత్ అధికారులు స్పందించి మరమ్మతులు చేసి పునరుద్దరించారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు, కోట, వాకాడులో రెండు రోజుల క్రితం పోసిన నారుమళ్లు కొంత మేర దెబ్బతిన్నాయి. రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లు జలమయాయ్యయి. వెంకటగిరి, ఉదయగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.
కుండపోత
Published Mon, Nov 18 2013 5:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement