అనుకున్నదే అయింది. కేంద్ర రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మళ్లీ మొండిచెయ్యి లభించింది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలున్నా ఈ సారీ కేంద్ర రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీలు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. సమస్యలపై వారు కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయి. జిల్లాకు కొత్తగా ఒక్క రైలు కూడా మంజూరు కాలేదు. కొత్త రైల్వే లైన్.. విస్తరణ ఊసేలేదు.
పాత ప్రాజెక్టులకు నిధులూ రాలేదు. ఏళ్ల నుంచి ఉన్న ప్రజల ‘రైళ్ల హాల్టింగ్’.. రైళ్ల పొడిగింపు.. పునరుద్ధరణ డిమాండ్లు ఈ సారీ నెరవేరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడడం.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలో రావడంతో పాలకులు జిల్లాపై కరుణ చూపుతారని అనుకున్న జిల్లావాసులకు మళ్లీ నిరాశే మిగిలింది. మమతాబెనర్జీ, బన్సల్, మల్లిఖార్జున ఖర్గేల మాదిరిగానే సురేశ్ ప్రభు తన బడ్జెట్‌లో జిల్లాపై వివక్ష చూపారు.
గురువారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా మంత్రి రైల్వే బడ్జెట్ రూపొందించారు. మరుగుదొడ్ల ఆధునికీకరణ.. పరిశుభ్రత.. భద్రత.. మెరుగైన సేవ లే ప్రాధాన్యాంశాలుగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ప్రయాణికులపై ఈసారి మాత్రం చార్జీల భారం మోపలేదు. - సాక్షి, మంచిర్యాల
- రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు రిక్తహస్తం
- ఎంపీల ప్రతిపాదనలు బుట్టదాఖలు
- ‘రైళ్ల హాల్టింగ్స్’ చేయించుకోలేకపోయిన ఎంపీలు
- కొత్త ట్రాక్‌లు లేవు.. కొత్త రైళ్లూ లేవు..
- పాత ప్రాజెక్టులకు నిధులు స్వల్పం
- ప్రయాణికుల భద్రత .. సేవలకు పెద్దపీట
సాక్షి, మంచిర్యాల : ‘తూర్పు’ ప్రాంతంలో కొనసాగుతున్న మూడో రైలు మార్గం నిర్మాణ పనులకు బడ్జెట్‌లో రూ.83 కోట్లు కేటాయించారు. పెద్దంపేట-మంచిర్యాల పనుల కోసం రూ.58 కోట్లు, రాఘవపురం-మందమర్రి పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. మంచిర్యాల-రవీంద్రఖని, బెల్లంపల్లి-రేచిని రోడ్డు, సిర్పూర్ కాగజ్‌నగర్ పరిధిలోని 77వ లెవల్ క్రాసింగ్ వద్ద మధ్య ఫ్లై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులకు పచ్చజెండా ఊపారు. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్-ముథ్కేడ్ వరకు (160కి.మీ) గేజ్ మార్పిడి కోసం రూ.కోటి కేటాయించారు. రూ.2,020 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఖాజీపేట-బల్లార్షా (202 కి.మీ)వరకు మూడో లైన్ నిర్మాణ పనులకు బడ్జెట్‌లో రూ.46 కోట్లు కేటాయించారు.
వెక్కిరిస్తున్న ప్రాజెక్టులు..
2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్-పటాన్‌చెరు రైల్వే లైను నిర్మాణానికి నిధులు మంజూరై.. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. అయినా ఈ బడ్జెట్‌లో కనీసం మార్గం ప్రస్తావన కూడా రాలేదు. దీంతో పశ్చిమ జిల్లావాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు సుదూర తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు 2013లో మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గాన్ని ప్రకటించారు.
ఈ సారి కేంద్రం బడ్జెట్‌లో ఈ మార్గాన్ని విస్మరించింది. 2012 రైల్వే బడ్జెట్‌లో మైసూర్-హౌరా వయా గోండియా, ఆదిలాబాద్ మీదుగా రైలును మంజూరు చేసి చివరకు మరో మార్గానికి మళ్లించారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం కనికరిస్తుందనుకుంటే సురేశ్ ప్రభూ అసలు ఈ మార్గం ప్రస్తావనే తేలేదు. 2010-11 రైల్వే బడ్జెట్‌లో మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో డిస్పెన్సరీ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆదిలాబాద్, బాసర స్టేషన్లలో జనరల్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఇప్పుడూ చోటు దక్కలేదు.
జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గడ్‌చందూర్‌కు రైల్వే మార్గం కలగానే మిగిలిపోయింది. సికింద్రాబాద్-బాసర డబుల్‌లైన్ నిరా్మాణం ఊసేలేదు. మంచిర్యాలలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం.. ఆసిఫాబాద్ క్రాస్‌రోడ్డు, రేచినిరోడ్డు, బాసర రెల్వేస్టేషనో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ బడ్జెట్‌లో వాటి నిర్మాణ ఊసేలేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రయాణికుల భద్రతకు భరోసా..
కేంద్ర మంత్రి ప్రభు.. తన బడ్జెట్‌లో ప్రయాణికుల భద్రతకు భరోసా ఇచ్చారు. మెరుగైన సేవలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రమాదాలు జరగకుండా.. కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఐఐటీ కాన్పూర్, ఇస్రోల సహాయంతో హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా భద్రతా కోసం 182 టోల్‌ఫ్రీ నెంబర్, మార్చి ఒకటో తేదీ నుంచి ప్రయాణికుల కోసం 138 హెల్ప్‌లైన్ ఏర్పాటు, రైళ్ల రాకపోకలు.. సమయ పాలన సమాచారం తెలుసుకునేందుకు ఎస్‌ఎంఎస్ వ్యవస్థ, 120 రోజుల ముందే టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకునే అవకాశం, ప్రధాన స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు, తక్కువ ధరకే ప్రయణికులకు తాగునీరు, ప్రయాణికులు రద్దీగా ఉన్న చోట అదనపు బోగీలు..
మహిళా బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అంధుల సౌకర్యార్థం బోగీల ఏర్పాటు, డెబిట్ కార్డుతో సేవలు పొందే వసతి, కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ‘స్వచ్ఛ రైలు’ అమలుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. స్టీలు, బొగ్గు రవాణాకు కొత్త లైన్ల నిర్మాణం చేపడుతామన్న ప్రభు అందులో జిల్లాకు ఒక్క లైను కూడా మంజూరు చేయలేదు. దేశవ్యాప్తంగా 152 రైల్వే స్టేషన్లు ఆధునికీకరిస్తామని చెప్పిన మంత్రి జిల్లాలో ఒక్క స్టేషన్‌నూ ఆ జాబితాలో చేర్చలేదు.
కేటాయింపులేవీ.. మహాప్రభు..
Published Fri, Feb 27 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement