Trains Halting
-
‘కృష్ణా’ వాసుల కష్టాలు.. ఆగని ఎక్స్‌ప్రెస్.. రాయచూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిందే!
కృష్ణా (మహబూబ్‌నగర్): కృష్ణా రైల్వేస్టేషన్‌కు ఓ విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలో మొదటిసారి రైల్వేలైన్ ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ రైల్వేస్టేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని కృష్ణానదిలో పూజ కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర సూదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు వచ్చేవారు. ఆ భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ స్టేషన్లో అన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేవారు. కాగా కరోనా మహామ్మారి కారణంగా గత కొంత కాలంగా ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలపకుండగా రద్దు చేశారు. దీంతో కృష్ణానదికి వచ్చే భక్తులు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గాను పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. తక్షణమే గతంలో మాదిరిగా ఈ స్టేషన్లో రైళ్లను అన్నింటిని నిలిపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే మంత్రికి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని రైల్వేజీఎంకు విజ్ఞప్తి చేస్తున్న కృష్ణా గ్రామస్తులు (ఫైల్) అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ విషయంపై రైల్వే స్టేషన్ ముందు అఖిల పక్షాల మద్దతుతో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని అంటున్నారు. ఈ ప్రాంత నుంచి ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ముంబాయి, చెన్నై, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు ప్రస్తుతం ఇక్కడ రైళ్లను నిలపకపోవడంతో రాయచూర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని మూలంగా కృష్ణాలోని చిన్న చిన్న వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు మరోమారు ఆలోచించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రిలే నిరాహార దీక్ష చేపడతాం.. స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని అప్పటి కేంద్ర రైల్వే మంత్రిని ఒప్పించాం. అప్పటి నుంచి కృష్ణానదికి వచ్చే భక్తులకు చాల ఉపయోగకరంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్దరించినా ఈ స్టేషన్లో వాటిని నిలపడం లేదు. దీని మూలంగా ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. – అమర్‌కుమార్ దీక్షిత్, పురోహితుడు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తాం ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతూ త్వరలోనే అఖిల పక్షాల అధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రిని, దక్షణ మధ్య రైల్వే ధ్యెంను కలిసి విజ్ఞప్తి చేస్తాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. – మహాదేవ్, కృష్ణా మాజీ సర్పంచ్ రాయచూర్‌కు వెళ్తున్నాం మా పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం బెంగుళూర్లో ఉంటున్నారు. మేము, మా పిల్లలు బెంగుళూర్‌కు వెళ్లాలంటే రాయచూర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో కృష్ణాలోనే రైళ్లు నిలవడంతో ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు నిలపకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. – విశ్వనాథ్‌గౌడ, గుర్జాల్ -
కేటాయింపులేవీ.. మహాప్రభు..
అనుకున్నదే అయింది. కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ మొండిచెయ్యి లభించింది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలున్నా ఈ సారీ కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీలు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. సమస్యలపై వారు కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయి. జిల్లాకు కొత్తగా ఒక్క రైలు కూడా మంజూరు కాలేదు. కొత్త రైల్వే లైన్.. విస్తరణ ఊసేలేదు. పాత ప్రాజెక్టులకు నిధులూ రాలేదు. ఏళ్ల నుంచి ఉన్న ప్రజల ‘రైళ్ల హాల్టింగ్’.. రైళ్ల పొడిగింపు.. పునరుద్ధరణ డిమాండ్లు ఈ సారీ నెరవేరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడడం.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలో రావడంతో పాలకులు జిల్లాపై కరుణ చూపుతారని అనుకున్న జిల్లావాసులకు మళ్లీ నిరాశే మిగిలింది. మమతాబెనర్జీ, బన్సల్, మల్లిఖార్జున ఖర్గేల మాదిరిగానే సురేశ్ ప్రభు తన బడ్జెట్లో జిల్లాపై వివక్ష చూపారు. గురువారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా మంత్రి రైల్వే బడ్జెట్ రూపొందించారు. మరుగుదొడ్ల ఆధునికీకరణ.. పరిశుభ్రత.. భద్రత.. మెరుగైన సేవ లే ప్రాధాన్యాంశాలుగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ప్రయాణికులపై ఈసారి మాత్రం చార్జీల భారం మోపలేదు. - సాక్షి, మంచిర్యాల - రైల్వే బడ్జెట్లో జిల్లాకు రిక్తహస్తం - ఎంపీల ప్రతిపాదనలు బుట్టదాఖలు - ‘రైళ్ల హాల్టింగ్స్’ చేయించుకోలేకపోయిన ఎంపీలు - కొత్త ట్రాక్‌లు లేవు.. కొత్త రైళ్లూ లేవు.. - పాత ప్రాజెక్టులకు నిధులు స్వల్పం - ప్రయాణికుల భద్రత .. సేవలకు పెద్దపీట సాక్షి, మంచిర్యాల : ‘తూర్పు’ ప్రాంతంలో కొనసాగుతున్న మూడో రైలు మార్గం నిర్మాణ పనులకు బడ్జెట్లో రూ.83 కోట్లు కేటాయించారు. పెద్దంపేట-మంచిర్యాల పనుల కోసం రూ.58 కోట్లు, రాఘవపురం-మందమర్రి పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. మంచిర్యాల-రవీంద్రఖని, బెల్లంపల్లి-రేచిని రోడ్డు, సిర్పూర్ కాగజ్‌నగర్ పరిధిలోని 77వ లెవల్ క్రాసింగ్ వద్ద మధ్య ఫ్లై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులకు పచ్చజెండా ఊపారు. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్-ముథ్కేడ్ వరకు (160కి.మీ) గేజ్ మార్పిడి కోసం రూ.కోటి కేటాయించారు. రూ.2,020 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఖాజీపేట-బల్లార్షా (202 కి.మీ)వరకు మూడో లైన్ నిర్మాణ పనులకు బడ్జెట్లో రూ.46 కోట్లు కేటాయించారు. వెక్కిరిస్తున్న ప్రాజెక్టులు.. 2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్-పటాన్చెరు రైల్వే లైను నిర్మాణానికి నిధులు మంజూరై.. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. అయినా ఈ బడ్జెట్లో కనీసం మార్గం ప్రస్తావన కూడా రాలేదు. దీంతో పశ్చిమ జిల్లావాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు సుదూర తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు 2013లో మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గాన్ని ప్రకటించారు. ఈ సారి కేంద్రం బడ్జెట్లో ఈ మార్గాన్ని విస్మరించింది. 2012 రైల్వే బడ్జెట్లో మైసూర్-హౌరా వయా గోండియా, ఆదిలాబాద్ మీదుగా రైలును మంజూరు చేసి చివరకు మరో మార్గానికి మళ్లించారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం కనికరిస్తుందనుకుంటే సురేశ్ ప్రభూ అసలు ఈ మార్గం ప్రస్తావనే తేలేదు. 2010-11 రైల్వే బడ్జెట్లో మంచిర్యాల రైల్వేస్టేషన్లో డిస్పెన్సరీ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆదిలాబాద్, బాసర స్టేషన్లలో జనరల్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఇప్పుడూ చోటు దక్కలేదు. జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గడ్చందూర్కు రైల్వే మార్గం కలగానే మిగిలిపోయింది. సికింద్రాబాద్-బాసర డబుల్‌లైన్ నిరా్మాణం ఊసేలేదు. మంచిర్యాలలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం.. ఆసిఫాబాద్ క్రాస్‌రోడ్డు, రేచినిరోడ్డు, బాసర రెల్వేస్టేషనో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ బడ్జెట్లో వాటి నిర్మాణ ఊసేలేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రయాణికుల భద్రతకు భరోసా.. కేంద్ర మంత్రి ప్రభు.. తన బడ్జెట్లో ప్రయాణికుల భద్రతకు భరోసా ఇచ్చారు. మెరుగైన సేవలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రమాదాలు జరగకుండా.. కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఐఐటీ కాన్పూర్, ఇస్రోల సహాయంతో హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా భద్రతా కోసం 182 టోల్‌ఫ్రీ నెంబర్, మార్చి ఒకటో తేదీ నుంచి ప్రయాణికుల కోసం 138 హెల్ప్‌లైన్ ఏర్పాటు, రైళ్ల రాకపోకలు.. సమయ పాలన సమాచారం తెలుసుకునేందుకు ఎస్ఎంఎస్ వ్యవస్థ, 120 రోజుల ముందే టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకునే అవకాశం, ప్రధాన స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు, తక్కువ ధరకే ప్రయణికులకు తాగునీరు, ప్రయాణికులు రద్దీగా ఉన్న చోట అదనపు బోగీలు.. మహిళా బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అంధుల సౌకర్యార్థం బోగీల ఏర్పాటు, డెబిట్ కార్డుతో సేవలు పొందే వసతి, కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ‘స్వచ్ఛ రైలు’ అమలుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. స్టీలు, బొగ్గు రవాణాకు కొత్త లైన్ల నిర్మాణం చేపడుతామన్న ప్రభు అందులో జిల్లాకు ఒక్క లైను కూడా మంజూరు చేయలేదు. దేశవ్యాప్తంగా 152 రైల్వే స్టేషన్లు ఆధునికీకరిస్తామని చెప్పిన మంత్రి జిల్లాలో ఒక్క స్టేషన్నూ ఆ జాబితాలో చేర్చలేదు. -
హైదరాబాద్ కు సూపర్ ఫాస్ట్ ప్రతిపాదన
- పలురైళ్ల హాల్టింగ్‌కు విన్నపం - రైల్వే బడ్జెట్ కోసం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదనలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు పగటిపూట సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 2015-16 బడ్జెట్ కోసం ప్రతిపాదన పెట్టారు. రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం విజయవాడలో జరగననున్న జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ఏర్పాటు చేస్తున్న సమావేశంలో కూడా ఆయన పాల్గొని తన వాదన వినిపించనున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటుపై ఆయన ఇప్పటికే రైల్వే మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ముంబై నుంచి గుంటూరుకు వయా గుంతకల్ మీదుగా కొత్త రైలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల కర్నూలు, మహబూబ్‌నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని వేలాదిమంది ముంబైలో నివసించే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు గిద్దలూరు మీదుగా మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఒంగోలు నుంచి దొనకొండ రైల్వే లైను, ఒంగోలులో ఏర్పాటు చేసే ఎస్కలేటర్లు, లిఫ్ట్ల్, నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే లైను, గుంటూరు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన రైలునీర్ ప్లాంట్ ప్రగతిపై నివేదిక కావాలని కోరారు. పలు రైళ్లను పొడిగించాలని కోరారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకూ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకూ పొడిగించాలని, గుంటూరు - ద్రోణాచలం మధ్య నడిచే రైలును గుంతకల్ వరకూ పొడిగించాలని కోరారు. నంద్యాల - కర్నూలు మధ్య నడుస్తున్న డెమో రైలును గిద్దలూరు వరకూ, తెనాలి మార్కాపురం మద్య నడుస్తున్న రైలును గిద్దలూరు వరకూ, సాయినగర్ షిర్టీ నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు జంక్షన్ వరకూ పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు. ఒంగోలు స్టేషన్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ స్టేషన్ కావదడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా కేరళా, బీహార్, హిమాచలప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నందున వారికి అనుగుణంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఒంగోలులో ఆగేలా చూడాలని కోరారు. ఒంగోలులో ఆగాల్సిన రైళ్లు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్, చెన్నై - జోధ్‌పూర్ - చెన్నై మధ్య నడిచే జోద్పూర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై - జైపూర్ - చెన్నై మధ్య నడిచే జైపూర్ ఎక్స్‌ప్రెస్, పొండిచ్చేరీ - న్యూఢిల్లీ - పాండిచ్చేరీ మధ్య నడిచే పాండిచ్చేరీ ఎక్స్‌ప్రెస్‌లకు ఒంగోలులో హాల్ట్ ఇవ్వాలని కోరారు. టంగుటూరులో ఆగాల్సిన రైళ్లు... తిరుపతి - విశాఖపట్నం మధ్య నడిచే తిరుమలా ఎక్స్‌ప్రెస్, చెన్నై - ఎగ్మోర్ మధ్య నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై - హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్. గూడూరు - హైదరాబాద్ నడుమ నడిచే సింహపూరి ఎక్స్‌ప్రెస్. సింగరాయకొండలో నిలపాల్సిన రైళ్లు... హైదరాబాద్ - కొచ్చిన నడుమ నడిచే శబరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్, చైన్నై - హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం - తిరుపతి మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్. దొనకొండలో ఆగాల్సిన రైళ్లు హౌరా వెళ్లే ఎస్ఎస్పిఎన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు. కురిచేడులో ఆగాల్సిన రైళ్లు.. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గిద్దలూరులో ఆగాల్సిన రైళ్లు పూరీ నుంచి బెంగళూరు వెళ్లే గరీబ్ధ్