state Division issue
-
సడలని పట్టు! విభజన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచినా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రధాని దృష్టికి తెచ్చారు. అపరిష్కృత అంశాలపై గతంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పలుమార్లు సమావేశమై కొంత పురోగతి సాధించినా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఆర్థ్ధిక ఆంక్షలపై జోక్యం చేసుకోండి.. గత సర్కారు పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను ఇప్పుడు సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణ పరిమితిపై ఆంక్షలు విధిస్తోందని, కేటాయించిన రుణ పరిమితిలో కోతలు విధిస్తోందని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. గత సర్కారు చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిల అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తం రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. పోలవరానికి నిధులిచ్చి సహకరించండి.. ప్రధానితో భేటీలో ప్రధానంగా పోలవరానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన అంచనా వ్యయాల ఖరారు, నిర్వాసితులకు చెల్లింపులు లాంటి అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్లను రెండేళ్లుగా కేంద్రం చెల్లించలేదని, ఈ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానికి గుర్తు చేస్తూ దీన్ని ఖరారు చేసి త్వరగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి కాంపొనెంట్‌ను విడిగా కాకుండా ప్రాజెక్టులో భాగంగానే చూడాలని కోరారు. నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా పరిగణించడంతో బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల నిర్మాణంలో జాప్యం కావడంతోపాటు వ్యయం కూడా పెరుగుతోందని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్ వారీగా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లిస్తే చాలావరకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు రూ.10,485.38 కోట్లు అవసరమని, అడ్‌హాక్‌గా నిధులు మంజూరు చేస్తే పనులు వేగంగా కొనసాగుతాయని వివరించారు. ఈ నిధులను మంజూరు చేస్తే భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని సానుకూలం.. సీఎం ట్వీట్ విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించాం. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరటంపై ప్రధాని సానుకూలంగా స్పందించారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ బకాయిలు.. హోదా.. విశాఖ మెట్రో తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ జెన్కోకు ఈ బకాయిల వసూలు అత్యవసరమన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనలు హేతుబద్ధంగా లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్నప్పటికీ 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రేషన్ సరుకులను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని చెప్పారు. ఇందుకోసం రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నెలకు సుమారు 3 లక్షల టన్నుల రేషన్ బియ్యం నిల్వలు కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపచేసినట్లు అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అంశాలతో నీతి ఆయోగ్ కూడా ఏకీభవించి కేంద్రానికి సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ► రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యమన్నారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ► కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచేలా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని సీఎం కోరారు. ► రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య 26కు పెరిగిన నేపథ్యంలో అదనంగా మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని సీఎం కోరారు. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 3 మెడికల్ కాలేజీలతో కలిపి 14 మాత్రమే ఉన్నందున మిగిలిన 12 జిల్లాలకు కూడా వెంటనే వైద్య కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నట్లు తెలిపారు. ► విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు. -
సీఎం జగన్ అలుపెరగని పోరాటం.. కదిలిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంతోపాటు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం నిధులివ్వడంపై కేంద్రం మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఈ ఏడాది జనవరి 24న అధికారుల కమిటీ చర్చించిన అంశాలను ప్రస్తావించి సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు తన కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నియమించిన రాష్ట్ర అధికారుల కమిటీతో చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కమిటీని పీఎంవో ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో కేంద్ర అధికారుల కమిటీతో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సన్నాహక సమావేశం జరిగింది. నేడు జరిగే సమావేశం సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని, సమస్యల పరిష్కారం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానితో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రధానాంశాలు ఇవీ ► పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలి. ► సీడబ్ల్యూసీ టీఏసీ ఖరారు చేసిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలి. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు డీబీటీ (నేరుగా నగదు బదిలీ) పద్ధతిలో పరిహారాన్ని అందించాలి. ► రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలి. ► 2014–15కి సంబంధించిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు తదితరాల రూపంలో రాష్ట్రానికి ఈ నిధులను రావాల్సి ఉంది. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే రేషన్ వ్యయాన్ని భరిస్తోంది. ఏపీకి నిర్దేశించిన కేటాయింపులను పునఃపరిశీలించాలని నీతిఆయోగ్ కూడా సూచించింది. ► తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల మేర విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. బకాయిలు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు గట్టెక్కుతాయి. ► హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి. ► ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను నెరవేర్చాలి. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేక హోదా ద్వారానే దక్కుతాయి. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుంది. ► రాష్ట్రంలో 26 జిల్లాలకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరో 12 కాలేజీలకు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలి. ► కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలి. 14 ఏరియాలకు కేటాయింపు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అలుపెరగని పోరాటం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వడంతోపాటు విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పలు దఫాలు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులతో సమావేశమై సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 3న ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర అధికారులతో కమిటీని నియమించాలని పీఎంవోను ప్రధాని ఆదేశించారు. జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో జల్ శక్తి శాఖ, పౌరసరఫరాల శాఖ తదితర శాఖల కార్యదర్శులతో పీఎంవో కమిటీ ఏర్పాటు కాగా అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, జలవనరులు, హోంశాఖ, పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు తదితరులతో సీఎంవో కూడా కమిటీని నియమించింది. కమిటీ తొలుత జనవరి 24న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో ఆయా అంశాలను మరోసారి ప్రస్తావించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. -
ఇంకెన్నాళ్లు..?
సాక్షి, హైదరాబాద్: భర్త ఒక చోట.. భార్య ఒక చోట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందల మంది ఉపాధ్యాయులు ఇలా నాలుగున్నరేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజనతో దూరమైన టీచర్ దంపతులు ఒక్క చోటుకి చేరేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ఒక్కటి చేసేందుకు గతేడాది అంగీకరించినా అధికారులు రూపొందించిన నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. ఒక టీచర్ తెలంగాణకు వస్తే మరో టీచర్ ఏపీకి వెళ్లేలా పరస్పర (మ్యూచువల్) బదిలీలకు ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. అయితే ఆ బదిలీల అమలుకు అధికారులు విధించిన నిబంధనలే వారిని దగ్గర కానివ్వడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిబంధనల కారణంగా పదుల సంఖ్యలో టీచర్లకే లబ్ధి చేకూరింది. నిబంధనల్లో ఏముందంటే.. అంతర్రాష్ట్ర బదిలీల కోసం టీచర్ల నుంచి వెల్లువెత్తిన విజ్ఞప్తుల మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో గతేడాది ఉన్నతాధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. దాని సిఫారసుల మేరకు అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలుపుతూ 2017 ఆగస్టు 7 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అయితే స్పౌజ్, పరస్పర కేటగిరీలో బదిలీ కోరుకునే ఇద్దరు టీచర్లు ఒకే సబ్జెక్టు కలిగి ఉండాలని, ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తూ ఉండాలని, స్థానికత (నేటివిటీ) కలిగి ఉండాలని నిబంధన విధించారు. ఈ నిబంధనే అనేక మందికి శాపంగా మారింది. అంతర్రాష్ట్ర బదిలీ కోసం పరస్పర కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు వందల మంది ఉన్నా.. ఒకే సబ్జెక్టు, ఒకే మేనేజ్మెంట్, నేటివిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నారు. దీంతో వందల మంది పరస్పర బదిలీకి అర్హత లేకుండాపోయింది. ఈ నిబంధనల కారణంగా దాదాపు 300 మంది వరకు అసలు దరఖాస్తు కూడా చేసుకోపోగా, దరఖాస్తు చేసుకున్న 250 మందిలో కూడా తక్కువ మందికే లబ్ధి చేకూరింది. కేవలం 20 మంది టీచర్లకు మాత్రమే ఇటీవల బదిలీ జరిగింది. మిగతా వారికి బదిలీలు జరిగే అవకాశం లేకుండాపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆ బదిలీల ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడిగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో వారంతా ఆందోళనలో పడ్డారు. కమిటీ ఉత్తర్వుల ఆలస్యంతో ఆందోళన.. అధికారుల నిబంధనలతో ఎక్కువ మంది టీచర్లకు అంతర్రాష్ట బదిలీకి అవకాశమే లేకుండాపోతోందని టీచర్లు ప్రభుత్వానికి మళ్లీ అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఉన్నతాధికారుల కమిటీ ఆ నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. అయితే కమిటీ నిర్ణయంపై ఇంతవరకు ఉత్తర్వులు జారీ కాకపోవడం, మరోవైపు బదిలీలకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో సంబంధిత టీచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘హెడ్ టు హెడ్’మ్యూచువల్ బదిలీకి అవకాశం ఇవ్వడం వల్ల ఇరు ప్రభుత్వాలకు అదనంగా ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, తమకు బదిలీకి అవకాశం కల్పించి తమ కుటుంబాల దగ్గరకు వెళ్లేలా చూడాలని కోరుతున్నారు. -
మరో మలుపు తిరిగిన విభజన అంశం
-
మరో మలుపు తిరిగిన విభజన అంశం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం మరో మలుపు తిరిగింది. మళ్లీ అఖిలపక్షం తెరపైకి వచ్చింది. విభజన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ వేయాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన విషయమై ఎంపిల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం కావడంతో సమస్యను పరిష్కరించడం కేంద్రానికి మరింత జఠిలమైపోయింది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న కొత్త ఆలోచన చేస్తోంది.