సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం, ప్రణాళిక రాహిత్యం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారుతోందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కుండబద్ధలు కొట్టింది. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ బుధవారమూ సమీక్ష సమావేశం నిర్వహించింది. పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్)లో నిర్మించిన నమూనా పోలవరం జలాశయంలో వివిధ స్థాయిలో వరదను పంపి.. ప్రయోగాలు చేసి డిజైన్‌లలో మార్పులు చేర్పులు చేయాలని పేర్కొంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీలో నిర్వహించే డీడీఆర్‌పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంంలో పెండింగ్ డిజైన్‌లు, స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను పూర్తి చేయడంపై సమగ్రంగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఆలోగా నమూనా డిజైన్‌లు సిద్ధం చేయాలని ఆదేశించింది.
హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో 194.92 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉందని.. గేట్ల తయారీ పనులు పూర్తి చేశామని పీపీఏకు సీఈ శ్రీధర్ వివరించారు. మే నెలాఖరుకు నాలుగు భాగాలుగా కాఫర్ డ్యామ్ పనులు పూర్తిచేయడానికి ప్రణాళిక రచించామన్నారు. దీనిపై పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పందిస్తూ మే నెలాఖరు నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయగలిగితేనే.. జూన్ రెండో వారం నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నదిలోకి మళ్లించవచ్చునన్నారు. ఇదే సమయంలో డీడీఆర్‌పీ ఛైర్మన్ ఏబీ పాండ్య స్పందిస్తూ హెడ్ వర్క్స్‌కు సంబంధించిన 45 డిజైన్‌లలో ఇప్పటివరకూ సీడబ్ల్యూసీ 27 డిజైన్‌లను ఆమోదించిందని మిగతా 18 డిజైన్‌లు అత్యంత కీలకమైనవని, వీటిని కూడా వీలైనంత తొందరగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని, అయితే ఇప్పటికీ కాంట్రాక్టర్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిజైన్ నమునాలు తమకు అందకపోవడాన్ని ఎత్తిచూపారు.
పనుల నాణ్యతపై పెదవివిరుపు..:
పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో నాణ్యతపై వైకే శర్మ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టడంపై పీపీఏ ప్రధానంగా చర్చించింది. జలాశయం పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనకు వేర్వేరు అధికారులను నియమించాలని.. కానీ ఒకే అధికారిని ఆ రెండు పదవుల్లో నియమించడాన్ని తప్పుబట్టింది. సెంట్రింగ్, షట్టరింగ్ పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే స్పిల్‌వేకు పలు బ్లాక్‌లలో పగుళ్లు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చడంపై సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సూచలన ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానాల (కనెక్టివిటీస్) పనుల్లో పురోగతి కన్పించకపోవడాన్ని ఎత్తిచూపింది. ఆ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి.. మే నాటికి పూర్తయ్యేలా చూస్తామని జలవనరుల శాఖ అధికారులు పీపీఏకు వివరించారు. ఈ సందర్భంలోనే మే నెలాఖరు నాటికి హెడ్ వర్క్స్, కాలువలు పూర్తి చేస్తామని చెబుతున్నారని, అయితే ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభించకుండా ఆయకట్టుకు నీళ్లు ఎలా అందిస్తారని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ ప్రశ్నించారు. ఇది ప్రణాళిక రాహిత్యాన్ని ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు.
పునరావాసంపై ప్రతి వారం సమీక్ష..:
కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రకారం కాఫర్ డ్యామ్‌ను 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి.. నీటిని నిల్వ చేస్తే 18,118 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారన్నారు. ఇప్పటివరకూ 3,922 కుటుంబాలకే పునరావాసం కల్పించారని.. మిగిలిన కుటుంబాలకు మేలోగా ఎలా పునరావాసం కల్పిస్తారని పీపీఏ ప్రశ్నించింది. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్ రేఖారాణి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచామని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. టెండర్లలో పునరావాస కాలనీల నిర్మాణానికి కనీస గడువు 12 నెలలు పెట్టారని.. ఇప్పుడేమో మే నెలాఖరకు పూర్తి చేస్తామని చెబుతున్నారని.. ఎలా విశ్వసించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తామని.. వాటి ఆధారంగా> చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు.
ప్రణాళిక లోపమే పోలవరానికి శాపం
Published Thu, Dec 20 2018 3:19 AM | Last Updated on Thu, Dec 20 2018 11:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment