‘మిగులు’ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 శాతం జనాభాకు ఆసరాగా ఉన్న కృష్ణా నది మిగులు జలాలు తగ్గుతున్నాయి. సరైన వర్షాలు లేక, ఎగువ నుంచి ప్రవాహాలు కరువై కృష్ణ బేసిన్‌లో ఆశించిన మేర నికర జలాలు కరువవ్వగా, మిగులు జలాల మాటే లేనంతగా పడిపోతున్నాయి. 2003-04 ఏడాది తర్వాత 2015-16లోనే అత్యంత తక్కువగా మిగులు రూపంలో జలాలు ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలసినట్లు కేంద్ర జల సంఘం తేల్చింది. ప్రస్తుత జూన్‌తో 2015-16 వాటర్ ఇయర్ ముగియడంతో కృష్ణా, గోదావరి మిగులు జలాలపై దృష్టి పెట్టిన కేంద్ర జల సంఘం.. గతంతో పోలిస్తే మిగులు ఎలా తగ్గిందన్న దానిపై నివేదిక తయారు చేసింది.
దాని ప్రకారం గడిచిన 25 ఏళ్లలో 1990-91 నుంచి ఇప్పటి వరకు.. 1994-95 ఏడాదిలో అత్యంత గరిష్టంగా 1,329.30 టీఎంసీల మేర నీరు సముద్రంలోకి చేరగా, అత్యంత కనిష్టంగా 2002-03 ఏడాదిలో 2.28 టీఎంసీలు మాత్రమే మిగులుగా తేలింది. తర్వాతి ఏడాది 2003-04లోనూ కేవలం 6.29 టీఎంసీలే మిగులుగా తేలగా, మళ్లీ ఇప్పుడే అత్యంత తక్కువగా కేవలం 9.25 టీఎంసీలు మాత్రమే వచ్చినట్లుగా గుర్తించారు. ఇక గోదావరిలోనూ గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ధవళేశ్వరం వద్ద సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలు పూర్తిగా తగ్గాయి. 2015-16లో కేవలం 1,611 టీఎంసీలు మాత్రమే సముద్రంలో కలిశాయని కేంద్ర జల సంఘం లెక్కలు తేల్చింది.