ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ రూపొందించిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ డిజైన్‌ను జలవనరుల శాఖ తిరస్కరించింది.
సాక్షి, అమరావతి: ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ రూపొందించిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ డిజైన్‌ను జలవనరుల శాఖ తిరస్కరించింది. డిజైన్‌లో లోపాల్ని ఎత్తిచూపి.. వాటిని సరిదిద్దుతూ సరికొత్త డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించింది. ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, గేట్ల తయారీ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో కాఫర్ డ్యామ్ డిజైన్‌ను ప్రధాన కాంట్రాక్టు సంస్థ సీఎంకు అందించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన జలవనరులశాఖ ఉన్నతాధికారులు భారీ లోపాలున్నట్లు గుర్తించారు.
గతంలో 31 మీటర్ల ఎత్తు వరకు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇటీవల 41 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. కాఫర్ డ్యాం నిర్మాణంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్‌ను వినియోగిస్తామని డిజైన్‌లో కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. కానీ 41 మీటర్ల ఎత్తుతో నిర్మించే కాఫర్ డ్యామ్‌కు షీట్ ఫైల్స్‌తో ఊటను నియంత్రించడం అసాధ్యమని జలవనరులశాఖ అధికారులు తేల్చారు. కొత్త డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించారు.