దిగువ కాఫర్ డ్యామ్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పూజలు నిర్వహించి ప్రారంభిస్తున్న మేఘా సంస్థ ప్రతినిధులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ పనులను ఇప్పటికే దాదాపు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దిగువ కాఫర్ డ్యామ్ పనులను వేగవంతం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కుడి వైపున 96 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో డయా ఫ్రమ్ వాల్ (పునాది) నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా సోమవారం ప్రారంభించింది. నెలాఖరు నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను రక్షిత స్థాయికి పూర్తి చేసి.. సెప్టెంబరులో కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న సుమారు 0.4 టీఎంసీల నీటిని బయటకు తోడే పనులు చేపట్టనుంది.
నీటిని పూర్తిగా తోడివేశాక.. ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) పనులు చేపట్టి నిరంతరాయంగా చేయడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసేలా సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దాని అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రణాళిక మేరకు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వేను రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసింది.
జల వనరుల శాఖాధికారులు, డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న దృశ్యం
కాఫర్ డ్యామ్‌లపై ప్రత్యేక దృష్టి
పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేది ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్‌లోనే. ఈ డ్యామ్‌ను గోదావరి నది గర్భంలో ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564 మీటర్లు, గ్యాప్–2లో 1,750 మీటర్ల మేర ఈసీఆర్‌ఎఫ్‌ను, గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్) నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించేందుకు నదికి అడ్డంగా 2,480 మీటర్ల పొడవున 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్‌ను.. స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన నీరు గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడువున నిర్మించే ఈసీఆర్‌ఎఫ్ వైపు ఎగదన్నకుండా 1,613 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి.
ఇందులో ఎగువ కాఫర్ డ్యామ్ పనులను 40 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. ఈ పనులు నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు పునాదిని జెట్ గ్రౌటింగ్ విధానంలో చేశారు. కుడి వైపున నేల మృదువుగా ఉండటం వల్ల 96 మీటర్ల పొడవున డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మిస్తున్నారు. నెలాఖరు నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను రక్షిత స్థాయికి పూర్తి
చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment