రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2, 2014 తరువాత కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందువల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్‌జాట్ ఈమేరకు సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో గల సెక్షన్ 84(3), 85(8)డీ, పేరా 7ను ఉల్లంఘిస్తూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి వేసినట్టు ఏపీ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఏదైనా వచ్చిందా? వస్తే ఈ పథకాలను ఆపేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటంటూ రమేశ్ ప్రశ్నించారు. దీనికి సన్వర్‌లాల్ సమాధానమిస్తూ, ‘ఏపీ ప్రభుత్వం సంబంధిత అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక-ఆర్థిక అంచనా నివేదిక ఏదీ రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2015 ఆగస్టు 22న మాకు ఒక లేఖ రాసింది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2, 2014 తరువాత తాము ఏ కొత్త ప్రాజెక్టూ చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొంది. అందువల్ల పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అని పేర్కొన్నారు.
‘పాలమూరు’ ఎత్తిపోతల్లో ఉల్లంఘన లేదు
Published Tue, May 10 2016 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM
Advertisement
Advertisement