రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం, ప్రణాళిక రాహిత్యం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారుతోందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కుండబద్ధలు కొట్టింది. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ బుధవారమూ సమీక్ష సమావేశం నిర్వహించింది. పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్)లో నిర్మించిన నమూనా పోలవరం జలాశయంలో వివిధ స్థాయిలో వరదను పంపి.. ప్రయోగాలు చేసి డిజైన్‌లలో మార్పులు చేర్పులు చేయాలని పేర్కొంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీలో నిర్వహించే డీడీఆర్‌పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంంలో పెండింగ్ డిజైన్‌లు, స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను పూర్తి చేయడంపై సమగ్రంగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఆలోగా నమూనా డిజైన్‌లు సిద్ధం చేయాలని ఆదేశించింది.