స్పిల్ వేలో 41వ గేటును అమర్చేది ఇక్కడే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మరో రియాల్టీ షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. 48 గేట్లు అమర్చాల్సిన చోట ఇప్పటికి ఒక గేటు అమర్చుతూ ప్రాజెక్టు పూర్తయినట్లే హడావుడి చేస్తున్నారు. నిజానికి 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని ఇస్తానని గతంలో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. 2018 మరో వారం రోజుల్లో పూర్తి కానున్నా.. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన మట్టి, రాతి కట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు ప్రాథమిక స్థాయిని కూడా దాటలేదు. దీంతో మే, 2019 నాటికి పాక్షికంగానూ.. డిసెంబర్, 2019 నాటికి పూర్తిగానూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు మాట మార్చారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే, అదీ సాధ్యం కాదని భావించిన ఆయన.. వరుస వైఫల్యాలు, పోలవరంలో వేలాది కోట్ల రూపాయల కమీషన్‌ల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోమవారం కొత్త షోకు తెరతీశారు. పోలవరం స్పిల్ వేలో 41వ గేటు స్కిన్ ప్లేట్‌ను అమర్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రియాలిటీ షోలలో ఇది ఆదీ కాదు.. అంతమూ కాదు, ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదోక హడావుడి చేస్తూనే ఉంటారని సీనియర్ ఐఏఎస్ అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
మట్టి పనులే పూర్తికాలేదు..
పోలవరం జలాశయాన్ని 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జలాశయం(హెడ్ వర్క్స్) పనులను ఐదు భాగాలుగా చేపట్టారు. వీటిలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్), జలవిద్యుద్పుత్తి కేంద్రం, కుడి వైపు కాలువ అనుసంధానం.. ఎడమ వైపు కాలువ అనుసంధానం ఉన్నాయి. కుడి, ఎడమ వైపు కాలువల అనుసంధానం, జలవిద్యుద్పుత్తి కేంద్రం పనులు దాదాపుగా నిలిచిపోయాయి. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్నాక స్పిల్ వే ద్వారా వరద జలాలను గోదావరి నదిలోకి మళ్లిస్తారు. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా నదిలోకి విడుదల చేసేలా 1128.40 మీటర్ల పొడవుతో, 45.72 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను నిర్మించాలి. స్పిల్ వే నుంచి వరద జలాలను విడుదల చేయడానికి 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో కూడిన 48 గేట్లను అమర్చాలి. పది రివర్ స్లూయిజ్‌లను ఏర్పాటు చేయాలి. ఈ పనులు పూర్తి కావాలంటే 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలి. మట్టిపనిలో ఇంకా 194.42 లక్షల క్యూబిక్ మీటర్లు మిగిలి ఉంది. గోదావరి వరద జలాలను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి వీలుగా చేపట్టిన అప్రోచ్ ఛానల్‌లో 101.48 క్యూబిక్ మీటర్లు, వరద దిగువకు విడుదల చేయడానికి చేపట్టిన స్పిల్ ఛానల్ పనులలో ఇంకా 46.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేయాలి. కాంక్రీట్ పనుల్లో ఇంకా 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి.
రెండు బ్లాక్‌లే గేట్ల ఎత్తుకు..
స్పిల్ వేను 52 బ్లాక్‌లుగా నిర్మిస్తున్నారు. ఇందులో కేవలం రెండు బ్లాక్‌లు మాత్రమే 25.72 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు పనులు పూర్తయ్యాయి. ఆ రెండు బ్లాక్‌ల మధ్యనే 41వ గేట్‌ను అలంకార ప్రాయంగా అమర్చే పనులను సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఒక్కొక్క గేట్‌ను అమర్చాలంటే ఎనిమిది స్కిన్ ప్లేట్లను హారిజాంటల్ గెర్డర్లు, ఆర్మ్స్ గెర్డర్లు, బ్రాకెట్స్‌తో వెల్డింగ్ చేయాలి. ఒక్కో గేట్ బరువు 300 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కో గేటును అమర్చడానికి కనీసం 55 నుంచి 60 రోజులు పడుతుంది. ఈ గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా 250 మెట్రిక్ టన్నులతో కూడిన హైడ్రాలిక్ హాయిస్ట్‌లను అమర్చుతారు. వీటిని జర్మనీ నుంచి ఇప్పటివరకూ దిగుమతి చేసుకోలేదు. అవెప్పుడు చేరుతాయో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఇకపోతే జలాశయం పనుల్లో అత్యంత కీలకమైన 18 డిజైన్‌లకు సంబంధించి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా ఆమోదం పొందలేదు.
పనులన్నీ పునాదిలోనే..
పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోనే. గోదావరి నదీ గర్భంలో 2,454 మీటర్ల పొడవున దీనిని నిర్మించాలి. దీని నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాలి. ఇందుకు ఈసీఆర్‌ఎఫ్‌కు 250 మీటర్ల ఎగువన 2,050 మీటర్ల పొడవున ఒక కాఫర్ డ్యామ్, 200 మీటర్ల దిగువన 1,417 మీటర్ల పొడవున మరో కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్‌ను 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సీడబ్ల్యూసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ నాటికి స్పిల్ వే పనులను పూర్తి చేసి.. కనీసం 17 లక్షల క్యూసెక్కుల వరదను మళ్లించడానికి వీలుగా నిర్మాణం ఉన్నప్పుడే ఎగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఈ కాఫర్ డ్యామ్‌ను మే నాటికి పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనుల్లో ఇప్పటివరకూ కేవలం పునాది పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ఈ డ్యామ్ పూర్తి కావాలంటే 77.81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాతి పని చేయాలి. ఇప్పటివరకూ కేవలం 97 వేల క్యూబిక్ మీటర్ల పనులే చేశారు. ఇంకా 76.84 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలి. లేదంటే జూన్‌లో వచ్చే వరదకు కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్ పేర్కొన్నారు. ఇక దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయాలంటే 53.78 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాతి పనులు చేయాలి. ఇందులో ఇప్పటివరకూ పునాది పనులే చేశారు. ఇక ఈసీఆర్‌ఎఫ్ పనులు పునాదికే పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రాజెక్టు పనులు పూర్తయినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment