ప్రాజెక్టుల పర్యవేక్షణపై ఏమంటారు?
గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సినవేవి?
రెండు వారాల్లో తెలపాలని ఇరు రాష్ట్రాలను కోరిన కేంద్ర జలసంఘం
మార్గదర్శకాలను సూచిస్తూ వేర్వేరుగా లేఖలు
పర్యవేక్షణ అవసరం లేదంటున్న తెలంగాణ
కుదరదంటున్న ఏపీ సర్కారు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల వివరాలను అందించాలని ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కోరింది. బోర్డు పరిధిలోకి తెచ్చే ప్రాజెక్టుల ఎంపిక విషయంలో నాలుగు మార్గదర్శకాలను కూడా సూచించింది. వీటిపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను తెలపాలని, రెండు వారాల్లో ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని పేర్కొంది. అక్టోబర్ 15లోగా కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాన్ని నిర్వహించి, వాటి పరిధిలోని ప్రాజెక్టుల అంశంతో పాటు, కార్యాలయాల కూర్పుపై ఓ అవగాహనకు రావాలని ఇరు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ సూచించినట్లు తెలిసింది.
ప్రత్యేకంగా గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ప్రాతిపదిక తీసుకోవాలన్న దానిపై ఇటీవలే లేఖలు కూడా రాసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటిని అందించే ప్రాజెక్టులు, ఉమ్మడిగా నీరందించే కాలువలు ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి జరిగేవి, రెండు రాష్ట్రాల పర్యవేక్షణ అవసరమున్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆ లేఖల్లో అభిప్రాయపడింది. దీనిపై ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరింది.
వివాదం లేనప్పుడు బోర్డు పర్యవేక్షణ అనవసరం: తెలంగాణ సర్కారు
సీడబ్ల్యూసీ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గోదావరిలో నీరు సమృద్ధిగా ఉండటం, ఎక్కడా వివాదం లేని కారణంగా బోర్డు పర్యవేక్షణలోకి తీసుకురావాల్సిన ప్రాజెక్టులేవీ ఉండవని రాష్ర్ట ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కాస్త వివాదం ఉన్నా, ముంపు ప్రాంతాలను పూర్తిగా ఆంధ్రాలో కలిపినందున ఇక సమస్య ఉండబోదని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా బేసిన్‌లోకి వచ్చే 80 టీఎంసీల నీటిలో ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపకాలు జరిగాయి. ఇందులో ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా విషయాన్ని ట్రిబ్యునల్ మాత్రమే తేల్చుతుందని రాష్ర్ట వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశాన్ని బోర్డుకు నివేదిక ద్వారా తెలియజేస్తామని, అయితే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని పట్టుబడితే అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని నీటి పారుదల శాఖ ముఖ్యుడొకరు తెలిపారు.
రెండు బోర్డులకు ఒకే విధానం: ఏపీ
ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం గోదావరిపై ఎప్పుడో నిర్మితమైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, లోయర్ మానేరు, కడెం, ఘనపూర్ మొదలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాణహిత, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని వాదిస్తోంది. వివాదాలు నెలకొన్న రెండు బేసిన్ల పరిధిలోని బోర్డులకు ఒకే మార్గదర్శకాలను పాటించాలని, వేర్వేరు మార్గదర్శకాలు సరికాదని అభిప్రాయపడుతోంది. సుంకేశుల, రాజోలిబండ, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ సర్కారు కోరుతున్నందున... గోదావరి ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ అంటోంది.