
ఇక ‘సీడబ్ల్యూసీ’ భూ పంచాయితీ!
♦ కేంద్ర జల సంఘానికి కేటాయించిన 10 ఎకరాల భూమి కోసం ఇరు రాష్ట్రాల పట్టు
♦ తమకే ఇవ్వాలంటూ ఏపీ పరిధిలోని పోలవరం
అథారిటీ, రాష్ట్ర పరిధిలోని గోదావరి బోర్డుల విజ్ఞప్తి
♦ పోలవరం అథారిటీకి ఇవ్వబోమంటున్న తెలంగాణ
♦ గోదావరి బోర్డుకు మూడెకరాలు ఇచ్చే దిశగా యోచన
♦ కేంద్ర జల సంఘం వద్దకు చేరిన వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల మధ్య ఓ భూ పంచాయితీ మొదలైంది. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం కేంద్ర జల సంఘాని (సీడ బ్ల్యూసీ)కి కేటాయించిన పది ఎకరాల భూమిని తమకు ఇవ్వాలంటే.. తమకు ఇవ్వాలంటూ ఏపీకి చెందిన పోలవరం అథారిటీ, తెలంగాణ నిర్వహణ కింద ఉన్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అధికారులు పట్టుబడుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమిని పోలవరం అథారిటీకి కేటాయించరాదని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తుండగా... ఆ భూమి అయితే తమ కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని ఏపీ పేర్కొంటుడడంతో వివాదం ముదురు తోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని పరిష్క రించాలిన బాధ్యత కేంద్ర జల సంఘంపై పడింది.
సీడబ్ల్యూసీకి తలనొప్పి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం... ప్రాజెక్టు నిర్వహణ నిమిత్తం పోలవరం అథారిటీని ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సహా ఇతర అధికారుల నియామకం, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. ఈ అథారిటీ కేంద్ర జల సంఘం సూచనల మేరకు బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే ఈ అథారిటీ నిర్వహణను చూడాల్సిన ఏపీ ప్రభుత్వం... దానికి ప్రత్యేక కార్యాలయమేదీ కేటాయించలేదు. దీంతో అథారిటీ కార్యకలాపాలన్నీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న సీడబ్ల్యూసీ కార్యాలయం నుంచే సాగుతున్నాయి.
అది తమకు అనువుగా లేదంటూ అథారిటీ అధికారులు ఇటీవల ఏపీ ప్రభుత్వానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 1982-83 మధ్య బీహెచ్‌ఈఎల్ సమీపంలోని నలగండ్ల వద్ద కేటాయించిన 10 ఎకరాల భూమిని తమకు ఇవ్వాల్సిందిగా సీడబ్ల్యూసీకి విన్నవించాలని పోలవరం అథారిటీకి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు అథారిటీ అధికారులు సీడబ్ల్యూసీకి విన్నవించుకున్నారు. అయితే దీనిని పరిశీలించాలంటూ సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి పంపగా... తమ రాష్ట్ర పరిధిలోని భూమిని ఏపీ పరిధిలోని అథారిటీకి రిజిస్ట్రేషన్ చేయలేమని స్పష్టం చేసినట్లుగా సమాచారం.
మరోవైపు ఈ భూమి వివరాలు తెలుసుకున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆ పదెకరాల భూమిని తమకు కేటాయించాలంటూ సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వాలకు విన్నవించింది. దానిని సర్కారు పరిశీలిస్తోంది. అందులో కనీసం మూడు ఎకరాలైనా కేటాయించాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా కేంద్రానికి తన వివరణను పంపినట్లు సమాచారం. ఇలా ఒకే భూమి కోసం ఇరు సంస్థలు పట్టుబడుతుం డడం, ఇరు రాష్ట్రాలు భిన్న రీతిలో స్పంది స్తుండటం సీడబ్ల్యూసీకి తలనొప్పిగా మారిం ది. ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలన్న దానిపై సీడబ్ల్యూసీ కసరత్తు చేస్తోంది.