
జలంపై జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది వర్షాకాల సీజన్ పూర్తిగా ముగింపు దశకు వచ్చినా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేర లేకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని వచ్చే జూన్ వరకు కాపాడుకుంటూ ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమయ్యేనా అన్న సంశయాన్ని వ్యక్తంచేసింది. ఇరు రాష్ట్రాలు మరింత పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు తాగునీటి అవసరాలకు ఎలాంటి ముప్పు ఉండదని, లేనిపక్షంలో కరువు తప్పదని హెచ్చరించింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగం, భవిష్యత్ అవసరాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా బుధవారం కేంద్ర జల సంఘం కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిని ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వాడుకున్నాయి, మున్ముందు అవసరాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై చర్చించారు.
సాగుకు నీటిని మళ్లించొద్దు..
మొదటగా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యతపై సమావేశం చర్చించింది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకుగాను ప్రస్తుతం 846.6 అడుగుల మట్టానికి 73.08 టీఎంసీల నీరు ఉందని అధికారులు వివరించారు. ఇందులో కనీస నీటిమట్టం 834 అడుగుల వరకు 20 టీఎంసీలు, ఆ తరువాత మరో 50 టీఎంసీలకు వరకు నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. ఇక సాగర్‌లో నీటి లభ్యత కనీస మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయిందని వివరించారు. ఈ సందర్భంగా నీటి లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన బోర్డు, వచ్చే జూన్ వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు కనీసం 30 నుంచి 40 టీఎంసీల మేరకు ఉంటాయని, ప్రస్తుత లభ్యత నీటిని అప్పటివరకు కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని అభిప్రాయపడింది.
కాగా, ప్రస్తుత తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నుంచి మరింత నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల దృష్ట్యా 2.5 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ కోరగా, కృష్ణా డెల్టా అవసరాలకు 5 టీఎంసీలు, గుంటూరు, ప్రకాశం తాగునీటి అవసరాలకు మరో 2 టీఎంసీల మేర నీటి విడుదల చేయాలని ఏపీ కోరింది. అయితే దీనిపై బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం చెబుతామని స్పష్టం చేసింది.
త్వరలో మైనర్ ఇరిగేషన్ సీఈలతో బోర్డు భేటీ..
కాగా కృష్ణా బేసిన్ చిన్నతరహా ప్రాజెక్టుల కింద ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలపై తేల్చేందుకు త్వరలోనే ఇరు రాష్ట్రాల మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్‌లతో సమావేశం ఏర్పాటు చేస్తామని బోర్డు పేర్కొన్నట్టు తెలిసింది. చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 89.5 టీఎంసీలు, ఏపీకి సుమారు 20 టీఎంసీల వరకు కేటాయింపులున్నా ఇందులో ఎంత నీరు లభిస్తోంది. వినియోగం ఎంతన్నదానిపై సరైన వివరాల్లేవు. దీంతో కృష్ణాలో ఇరు రాష్ట్రాల పూర్తి నీటి వినియోగాన్ని లెక్కించడం ఇబ్బందిగా మారడంతో ఈ సమావేశాన్ని నిర్వహించే ఆలోచనలు చేస్తోంది.