
‘తుమ్మిళ్ల’కు ఏపీ అడ్డుపుల్ల!
- అనుమతుల్లేకుండా తెలంగాణ చేపడుతోందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు
- నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని వినతి
- డీపీఆర్ వివరాలు సమర్పించాలని రాష్ట్రానికి బోర్డు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్ప డుతున్న లోటును పూడ్చేందుకు రాష్ట్రం చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఎత్తిపోతలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాల నా అనుమతులు మంజూరు చేసి వారమైనా కాకముందే దీనికి ఆంధ్రప్రదేశ్ అడ్డుపుల్ల వేస్తోంది. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ సహా కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ సోమవారం బోర్డుకు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కోసం పంపాలని డిమాండ్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కృష్ణా బోర్డు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తమకు వీలైనంత త్వరగా సమర్పించాలని సూచించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ తెలంగాణకు లేఖ రాశారు.
ఆర్డీఎస్ నీటి వాటా ప్రకారమే చేపడుతున్నా...
బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే కాల్వల్లో పూడిక కారణంగా తెలంగాణకు దక్కుతున్న వాటా గరిష్టంగా 4 టీఎంసీలు దాటడం లేదు. దీంతో ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఈ దృష్ట్యా నీరందని 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్‌వాటర్ ఫోర్‌షోర్‌లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని తెలంగాణ నిర్ణయించి రూ. 783 కోట్లతో అనుమతులిచ్చింది.
ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు నీటిపారుదలశాఖ సిద్ధమవుతున్న తరుణంలో దీనికి ఏపీ అడ్డుతగులుతోంది. తెలంగాణ ఇప్పటికే పాలమూరు, డిండి, భక్త రామదాస, మిషన్ భగీరథ వంటి అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందని, వీటిపై అపెక్స్ కౌన్సిల్, సుప్రీంకోర్టు ముందు విచారణ జరుగుతున్న సమయంలోనే కొత్తగా తుమ్మిళ్ల చేపట్టిందని బోర్డుకు రాసిన లేఖలో ఏపీ పేర్కొంది.