
శ్రీశైలం నుంచి సాగర్‌కు 13 టీఎంసీల నీరు విడుదల
కృష్ణా బోర్డు అంగీకారం
తెలంగాణకు 4.2, ఏపీకి 4 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 13 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఇందులో 4.2 టీఎంసీల నీటిని తెలంగాణ, మరో 4 టీఎంసీలను ఏపీ తమ తాగునీటి అవసరాలకు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మరో 4.8 టీఎంసీలు సాగర్‌లో కనీస నీటిమట్టాలను నింపేందుకు అవసరమని తేల్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం రాత్రి మౌఖికంగా ఇరు రాష్ట్రాల అధికారులకు తెలియజేసింది. రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10.54 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ గత నెల 29న కృష్ణా బోర్డుకు విన్నవించింది.
నల్లగొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలకు 1.13 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 4.543 టీఎంసీలు అవసరముందని తెలిపింది. అయితే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 507 అడుగుల నీటిమట్టం ఉందని, జంట నగరాలకు నిరంతరంగా తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాలంటే సాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉండేలా చూడాలన్న హైకోర్టు ఉత్తర్వులను గుర్తుచేస్తూ, సాగర్‌లో నీటిమట్టాన్ని 510 అడుగులకు పెంచడానికి 4.87 టీఎంసీలు అవసరమని వివరించింది.
ఇదే సమయంలో ఏపీ సైతం తమ అవసరాలకు 4 నుంచి 6 టీఎంసీలు అవసరమని తన ప్రతిపాదనను తెలంగాణ ముందు పెట్టింది. సోమవారం ఉదయం ఏపీకి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు దీనిపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావును కలిశారు. అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు మాసబ్‌ట్యాంక్‌లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాతో భేటీ అయ్యారు. తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన ఆయన బోర్డు తాత్కాలిక చైర్మన్ రామ్‌శరాణ్ ఆదేశాల మేరకు శ్రీశైలం నుంచి 13 టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ నీటిని ఇరు రాష్ట్రాలు మార్చి వరకు వినియోగించుకోవాలని సూచించారు.