
పీఎంకేఎస్‌వైలో 9 రాష్ట్ర ప్రాజెక్టులు
కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం: హరీశ్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్సీ, ఇందిరా వరదనీటి కా లువ, కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్ద వాగు, మత్తడి వాగు, పాలెం వాగు, గొల్ల వాగు, గాలి వాగు ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) తొలి దశలో చేర్చడానికి ఈ పథకంపై నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆది వారం ఢిల్లీలో ఈ పథకం అమలు తీరుపై మం త్రివర్గ ఉప సంఘంనిర్వహించిన సమావేశం లో హరీశ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసే విషయంపై కమిటీలో చర్చ జరిగిందని మంత్రి తెలిపారు.
గిరిజన, కొండ ప్రాం తాలు, వామపక్ష తీవ్రవాదుల ప్రభావం ఉన్నప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కేంద్రం 60% నిధులను గ్రాంటుగా అందించాలని కమిటీ ఏకాభిప్రాయంతో సిఫార్సు చేసిందన్నా రు. ఈ పథకం కింద రెండు దశల్లో చేపట్టే ప్రాజెక్టుల అంచనాలను, వివరాలను ఈ నెల 28 కల్లా రాష్ట్రాలు పంపించాలని ఈ సమావేశం కోరిందన్నారు. కమిటీ తదుపరి సమావేశాన్ని రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో వచ్చేనెల 9-10 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని సుచార్ ప్రాజెక్టుపై కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద తక్కువ నీటితో ఎక్కువ సాగు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి కేంద్రం కొంత మేర గ్రాంటుగా, కొంత రు ణంగా నిధులను అందించే విషయం పరిశీలించాలని కోరామన్నారు. కేంద్ర జల సంఘంలో ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందని, ఇక నుంచి ఈ ప్రక్రియ వేగంగా జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.