అప్పులు చేయడమే గొప్పా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించడం చేతకాక అప్పులుచేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రి హరీశ్‌రావు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..నాబార్డు నుంచి రూ. 7వేల కోట్లు అప్పు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నామనే సోయి కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు లేదా అని ప్రశ్నించారు.
పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాకోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఎందుకు నిలదీయలేకపోతున్నారని అడిగారు. నయీమ్ కేసు విచారణ సిట్‌తో సాధ్యంకాదని, నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు వీహెచ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు రూ. 50 వేల కోట్లు మాఫీ చేసి, రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు.