అంతర్జాతీయ వేదికపై ‘మిషన్ కాకతీయ’ | "Mission Kakatiya ' On the international stage | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై ‘మిషన్ కాకతీయ’

Published Mon, Apr 4 2016 3:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

అంతర్జాతీయ వేదికపై ‘మిషన్ కాకతీయ’ - Sakshi

అంతర్జాతీయ వేదికపై ‘మిషన్ కాకతీయ’

♦ నేటి నుంచి ఢిల్లీలో ‘ఇండియన్ వాటర్ వీక్’
♦ 20 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు
♦ చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక
♦ ప్రజెంటేషన్ ఇవ్వనున్న రాష్ట్రం
♦ చివరి రోజు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్:
దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునే  అవకాశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా సుస్థిర నీటి యాజమాన్యానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించేందుకు ‘ఇండియన్ వాటర్ వీక్’ పేరుతో అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. ‘సుస్థిరాభివృద్ధికి నీటి యాజమాన్యం’ పేరుతో సోమవారం ప్రారంభం కానున్న ఈ సదస్సు 8వ తేదీ వరకు కొనసాగనుంది. అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలు, వ్యక్తులతో పాటు జల వనరులతో ముడిపడి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ వేదికపై రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.

 1,500 మంది ప్రతినిధుల ముందు ‘మిషన్’పై వివరణ..
 కేంద్ర జల వనరుల శాఖ ప్రాథమిక అంచనా మేరకు.. దేశంలో సగానికి పైగా జనాభా స్వచ్ఛమైన రక్షిత నీటిని పొందలేకపోతున్నారు. సుమారు 8.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందడం లేదు. దేశంలో ఏడాదికి నీటి జనిత రోగాల కారణంగా 73 లక్షల పనిదినాలు కోల్పోతోంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా వనరుల లభ్యత లేకపోవడంతో భవిష్యత్ అవసరాలపై ఇది పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా నీటి యాజమాన్యంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

చుక్క నీటిని ఒడిసిపట్టేలా, లభ్యత నీటిని పారిశ్రామిక, విద్యుత్, సాగు, తాగునీరు అవసరాలకు సమర్థంగా వినియోగించే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో భాగంగానే వ్యవసాయ, ప్లానింగ్, విద్యుత్, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖలు, ఐఐటీ, భారత నీటి, వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలసి ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ వచ్చే అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించనుంది. ఈ సదస్సులో సుమారు 20 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఈ సదస్సులో పాల్గొనాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్ ద్వారా ఆహ్వానించారు. అయితే ఇతర కార్యాక్రమాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ సదస్సుకు వెళ్లే అవకాశం లేదు. అయితే తొలి రోజు నుంచి ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. 8న జరిగే ముగింపు సమావేశానికి నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన చెరువులు, వాటిని నిర్ణీత కాలానికి నిర్దేశించుకున్న బడ్జెట్‌లకు అనుగుణంగా చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలు, ఇప్పటికే మొదటి విడత ద్వారా సాధించిన ఫలితాలను ప్రత్యేక ప్రజెంటేషన్‌లో రాష్ట్రం వివరించే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement