రైతుబిడ్డ కేసీఆర్..
- రూ.11 వేల కోట్లతో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్
- రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ రైతు బిడ్డ అని, రైతులందరికీ లబ్ధిచేకూరేలా పలు పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్సారెస్పీ కాల్వలను పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా, కరెంట్ కష్టాలు లేకుండా చేశారని గుర్తు చేశారు. రూ.11వేల కోట్లతో వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యాసంగిలో రెండుసార్లు మోటార్లు కాలిపోయేవని, అదే ఇప్పుడు కాలిపోవడంలేదని రైతులు అంటున్నారని హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరెంట్ కోతలు, ఎరువుల కోసం క్యూలైన్లు గుర్తుకు వస్తున్నాయని రైతులు అంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఉమ్మడి వరంగల్ జిల్లాకే దక్కుతుందన్నారు. నాలుగు లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా ఉచితంగా దుస్తులు అందజేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది నుంచి హిందువులకు కూడా బతుకమ్మ, దసరా పండుగలకు చీరలు, ధోవతులు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అబద్ధం చెబుతున్నారని, రాష్ట్రానికి రావాల్సిన రూ.60 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని సీఎం చెప్పడంతో తోక ముడుచుకొని వెళ్లారని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్ నాయక్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, టీఆర్‌ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.
ఇళ్లు కూల్చివేయొద్దని మంత్రి కాళ్లపై పడిన మహిళ
వరంగల్: మంత్రి హరీశ్‌రావు శనివారం వరంగల్ నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం సమీపంలో ఎస్సారెస్పీ కాలువల పటిష్టతతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పూడిక తీత పనులను పరీశీలించారు. మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న సుర్జీత్‌నగర్, స్నేహనగర్, కేఎల్ మహేంద్రనగర్, జగ్జీవన్‌రాం కాలనీలకు చెందిన ప్రజలు అక్కడికి వచ్చారు. తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు అంటున్నారని, కూల్చివేస్తే తాము నిరాశ్రయులమవుతామని కన్నీరుమున్నీరయ్యారు. ఓ మహిళ తమ ఇళ్లను కూల్చివేయొద్దని మంత్రి హరీశ్‌రావు కాళ్లపై పడి వేడుకుంది. ఆ మహిళను మంత్రి ఓదారుస్తూ కాలువల పక్కనే నివాసం ఉంటే నీటి ప్రవాహం పెరిగిన సమయంలో ఏదైనా విఘాతం కల్గితే భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలుంటాయన్నారు. అందువల్ల మీ అందరికి ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల గృహాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.