
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా నిలిపివేసి, పాత పద్ధతిలో 12 గంటల సరఫరా పునరుద్ధరించాలని అధికార పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. భూగర్భజలం తగ్గిపోతున్నందున రైతులను ఆదుకోవాలంటే దాన్ని మార్పు చేయటమే దిక్కని పేర్కొన్నారు. త్వరలో వరి పంట చేతికొచ్చే తరుణంలో 24 గంటల కరెంటు వల్ల అవి ఎండిపోయే పరిస్థితి ఉందని, అవకాశం ఉన్నవారు ఎక్కువగా నీటిని తోడుకుంటున్నందున భూగర్భజలం అడుగంటిపోయే ప్రమాదం నెలకొందన్నారు. గతంలో ఇదే విషయాన్ని తాను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా, గ్రామ పంచాయతీలతో తీర్మానం చేయించి పట్టుకొస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. దీంతో తన నియోజకవర్గం పరిధిలో ఆ మేరకు తీర్మానాలు చేయించినట్టు వెల్లడించారు. రైతుల లబ్ధిని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన జీరో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని సభలో ఆయనకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు.
మా ప్రశ్నలను మంత్రులు వినడం లేదు: బీజేపీ ఆరోపణ
సోమవారం శాసనసభ జీరో అవర్‌లో చిన్న గందరగోళం నెలకొంది. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తే అంశాలను ఏ మంత్రి నోట్ చేసుకుంటున్నారో తెలియక స్పీకర్ సహా సభ్యులు అయోమయానికి గురయ్యారు. బీజేపీ సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో సంస్కృతం, అరబిక్, ఫ్రెంచ్ భాషలను క్రమంగా ఎత్తేసేందుకు ప్రభుత్వం చూస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యాశాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభలో లేరు. దీంతో ఆ అంశాన్ని ఏ మంత్రి నోట్ చేసుకున్నారో తెలియక స్పీకర్ మధుసూదనచారి ‘ఎవరు నోట్ చేసుకుంటున్నారు’అని ప్రశ్నించారు. కానీ వెంటనే ఎవరూ లేవలేదు. ఇంతలో హరీశ్‌రావు లేచి సమాధానం చెప్పేలోపు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లేచి ఏదో అన్నారు. దీంతో అసలు మా సభ్యుడు లేవనెత్తిన అంశమేంటో కూడా మంత్రులు గుర్తించడం లేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్య, స్పాట్ వాల్యూయేషన్ గురించి కదా అంటూ ఇంద్రకరణ్‌రెడ్డి అనేసరికి, అయితే సభ్యుడి మాటలు వినలేదంటూ బీజేపీ సభ్యులు గట్టిగా అరిచారు. దీంతో మంత్రి హరీశ్‌రావు లేచి విషయాన్ని నోట్ చేసుకున్నానని, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment