కరెంట్‌చార్జీల పెంపునకు ప్రతిపాదిద్దాం!  | Lets propose to increase the current charger! | Sakshi
Sakshi News home page

కరెంట్‌చార్జీల పెంపునకు ప్రతిపాదిద్దాం! 

Published Tue, Dec 18 2018 1:54 AM | Last Updated on Tue, Dec 18 2018 1:54 AM

Lets propose to increase the current charger! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే స్వల్పంగా విద్యుత్‌చార్జీల పెంపును ప్రతిపాదించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల యాజమా న్యాలు యోచిస్తున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు భారీగా పెరిగిపోవడంతో అందుకు తగ్గట్లు విద్యుత్‌ కొనుగోళ్లు పెంచాల్సి రావడం, ద్రవ్యోల్బ ణం పెరగడం, వరుసగా మూడేళ్లు విద్యుత్‌చార్జీలు పెంచకపోవడం, విద్యుత్‌ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేయడం తదితర కారణాలతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ సబ్సిడీల బకాయిలు ఏటేటా పెరిగిపోతుండటంతో ఆర్థికంగా కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పంగా విద్యుత్‌చార్జీల పెంపును ప్రతిపాదించాలని విద్యుత్‌సంస్థల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలతో 3, 4 రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కల సి చర్చించనున్నాయి. ముఖ్యమంత్రి అ నుమతించనిపక్షంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్‌చార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ప్రతిపాదించనున్నాయి. అయితే, చార్జీలు పెంచకపోతే ఏర్పడనున్న ఆర్థికలోటును విద్యుత్‌ సబ్సిడీలు పెంచి భర్తీచేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2019–20) సంబంధించిన సమగ్ర ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)ను డిస్కంలు ఈఆర్సీకు సమర్పించనున్నాయి. ప్రస్తుత చార్జీలను కొనసాగించాలి లేదా ఏ మేరకు పెంచాలో ఇందులో ప్రతిపాదిం చనున్నాయి. వాస్తవానికి ఏఆర్‌ఆర్‌ సమర్పించేందుకు గడువు నవంబర్‌ 30తో ముగిసిపోగా ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించాలని డిస్కంలు కోరాయి. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా కోరే అవకాశం.. 
విద్యుత్‌చట్టం ప్రకారం ప్రతి ఏటా డిస్కంలు నవంబర్‌ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ను ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, ప్రతి ఏటా వివిధ కారణాలతో డిస్కంల యాజమాన్యాలు వాయిదా కోరడం, అందుకు ఈఆర్సీ అనుమతించడం ఆనవాయితీగా మారింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గత నెలలో ఏఆర్‌ఆర్‌ను డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. మరి కొన్నిరోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో మళ్లీ వాయిదా కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ సరఫరా అంచనాలు, ఆ మేరకు విద్యుత్‌ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు కానున్న మొత్తం వ్యయం, ప్రస్తుత విద్యుత్‌ చార్జీలను వచ్చే ఆర్థిక సంవత్సరం కొనసాగిస్తే ఏర్పడనున్న ఆర్థికలోటు, ఈ లోటును అధిగమించేందుకు వచ్చే ఏడాది పెంచాల్సిన విద్యుత్‌ చార్జీలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి డిస్కంలు ఏఆర్‌ఆర్‌ నివేదికలో పొందుపరుస్తాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అవసరమైన మార్పులు, చేర్పులతో ఈఆర్సీ కొత్త టారిఫ్‌ ఉత్తర్వులను జారీ చేస్తుంది. డిస్కంల కోరితే ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది సైతం అమలు చేయాలని ఈఆర్సీ ఆదేశిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement