సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముందుకు సాగుతున్నారని నీటిపారుదలశాఖ మంత్రి టి. హరీశ్‌రావు తెలిపారు. 24 గంటల విద్యుత్‌సరఫరాతో భవిష్యత్తులో ఇక విద్యుత్ సమస్య గురించి ప్రజలు అడగని పరిస్థితిని సీఎం తీసుకొచ్చారన్నారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో ప్రైవేటు ఉద్యోగుల డైరీని హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
కోటి ఎకరాల మాగాణం తెలంగాణ అనే నినాదం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వారు ఏ రాష్ట్రానికి వెళ్లినా సీఎం కేసీఆర్ అద్భుత పని తీరు గురించి అక్కడి ప్రజలు చర్చిస్తున్నారన్నారు. గత పాలకులు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించేవారని విమర్శించారు.
మీ హయాంలో పవర్ హాలిడే...
24 గంటల విద్యుత్ సరఫరా ఘనత తమదేనంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ హయాంలో కనీసం మూడు గంటల కరెంటు కూడా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు.
దేశమంతా పుష్కలంగా విద్యుత్ ఉంది కాబట్టే తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నారన్న ఉత్తమ్ వంటి వారు అంటున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారో చెప్పాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ తెలంగాణలో నాటి కరెంటు కష్టాలపై సమాధానమివ్వాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చేవారని, దీంతో కార్మికులకు సగం జీతం కూడా వచ్చేది కాదన్నారు. అదనపు సమ యం పని చేసి అదనంగా డబ్బులు సంపాదిద్దామనుకున్న కార్మికులకు కరెంటు కోతలు నిరాశనే మిగిల్చేవన్నారు. కానీ ప్రస్తుతం కార్మికులకు మేలు జరుగుతోందన్నారు.
ఉద్యమ ఉధృతికి తోడ్పడ్డాయి..
కొత్త సంవత్సర డైరీల ఆవిష్కరణలు తెలంగాణ ఉద్యమ ఉధృతికి సహకరించాయని హరీశ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తయ్యేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని, ఇళ్ల కేటాయింపుల్లో ప్రైవేటు ఉద్యోగులకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సైనికుల సంక్షేమానికి ఒక రోజు వేతనం
మంత్రి హరీశ్‌కు అందజేసిన ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: సైనికుల సంక్షేమ నిధికి 3.65 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులు, 2.24 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ ఒక రోజు మూలవేతనాన్ని విరాళంగా ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో టీజీవో, టీఎన్జీ వో, ఇతర ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి హరీశ్‌ను కలసి ఈ మొత్తాన్ని అందజేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు విరాళాన్ని అందజేసినట్లు సంఘాల నేతలు వెల్లడించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ. 10 వేల చొప్పున, మంత్రులు రూ. 25 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి పేర్కొ న్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్మీ అధికారులకు ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందిస్తామన్నారు. సైనిక సంక్షేమం కోసం సుమారు రూ.50 కోట్లు ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, మమత, సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, రాజేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment