హుస్నాబాద్/చిగురుమామిడి/ అక్కన్నపేట/కోహెడ: కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న మన తెలంగాణకు వచ్చి మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లొల్లి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లకి కరెంట్‌పై ఎంత అవగాహన ఉందో డీకే మాటలను బట్డి అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కాంగెస్ నేతలు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌కు వచ్చి మంచి ముచ్చట చెప్పారని హరీశ్ వ్యాఖ్యానించారు.
బోర్ బావుల వద్ద మోటార్లు బిగించిన రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇచ్చామని, తెలంగాణలో మీటర్లు బిగించడం లేదని, అందుకే రూ.35వేల కోట్ల రూపాయల నిధులను ఆపామని ఆమె చెప్పారని వివరించారు. బోరు బావుల వద్ద మీటర్లు బిగించమని కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు రూ.35వేల కోట్ల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69లక్షల మంది రైతులే ముఖ్యమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు.
కర్ణాటకలో ప్రజలు అవస్థలు పడుతున్నారు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్‌కుమార్, బీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోల్తా పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మనకు కూడా 6 గ్యారంటీలని వస్తున్నారని, వారి మాటలు విని ఆగం కావద్దని హెచ్చరించారు. అక్కడి ప్రభుత్వం అన్ని ధరలు పెంచడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నీతి లేని కాంగ్రెస్‌ను నమ్మొద్దని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment