
‘కాళేశ్వరం’పై మరోమారు ‘మహా’ చర్చలు
నేడు ముంబై వెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చర్చల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటికే ప్రాణహితలో భాగంగా చేపట్టే తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన కుదరగా, కాళేశ్వరంలో భాగంగా ఉండే మేడిగడ్డ బ్యారేజీ ఎత్తుపై స్పష్టత తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగిరం చేసింది. మేడిగడ్డ ఎత్తుపై జాయింట్ సర్వే పూర్తయినందున, దీనిపై మహారాష్ట్రతో చర్చించి 102 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పించాలని రాష్ట్రం గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా మహారాష్ట్రతో మరోమారు చర్చలు జరిపే నిమిత్తం మంగళవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముంబైకి వెళ్లనున్నారు. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీశ్ మహజన్‌తో ఆయన సమావేశమై మేడిగడ్డ ఎత్తు, ఒప్పందాలపై చర్చిస్తారు. ఈ భేటీలో వచ్చే స్పష్టత మేరకు ముఖ్యమంత్రుల అధ్యక్షతన ఉండే అంతర్రాష్ట్ర బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది ఒప్పందాలు చేసుకోనున్నారు.
పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులపై ఢిల్లీలో చర్చలు...
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనున్న రాష్ట్రంలోని 11 సాగునీటిప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఈనెల 11న ఢిల్లీలో జరిగే కేంద్ర జల వనరుల సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. దేవాదుల, కొమురంభీమ్, గొల్లవాగు, రాలివాగు, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు, పాలెంవాగు, ఎస్సారెస్పీ రెండో దశ, భీమా, వరద కాల్వలను సైతం ఈ పథకంలో చేర్చేందుకు సమన్వయ కమిటీ అంగీకరించగా, వాటికి నిధుల విడుదలపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాగా సోమవారం ఈ 11 ప్రాజెక్టుల అంచనాలు, నివేదికల తయారీ అంశాలపై మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే, జిల్లాల సీఈలు ఇందులో పాల్గొన్నారు.