ప్రాజెక్టులన్నీ ఖాళీ | All projects are empty | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులన్నీ ఖాళీ

Published Tue, Apr 26 2016 12:41 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ప్రాజెక్టులన్నీ ఖాళీ - Sakshi

ప్రాజెక్టులన్నీ ఖాళీ

రాష్ట్రంలో పూర్తిగా ఎండిపోయిన ప్రధాన నీటి ప్రాజెక్టులు
♦ గతంలో ఎన్నడూ లేనంతగా 561 టీఎంసీల నీటి కొరత
♦ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలు
♦ కనీస మట్టాలు సహా ఉన్న నీరు 167.68 టీఎంసీలే
♦ ఇందులోనూ వినియోగార్హమైన నీరు 10 టీఎంసీల లోపే
♦ కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. వేసవి ముగిసేందుకు మరో నెలన్నర సమయమున్నా ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. చివరికి తాగేందుకూ నీరందించలేని పరిస్థితికి దిగజారాయి. గోదావరి, కృష్ణా పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులదీ అదే దుస్థితి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల  పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 561 టీఎంసీల మేర నీటి కొరత నెలకొంది. ప్రధాన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం ఉన్నవి 167.68 టీఎంసీలే.

ఇందులోనూ కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న వినియోగార్హమైన నీరు 10 టీఎంసీలకన్నా తక్కువేనని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది తాగునీటి కోసం ఆధారపడిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కన్నా దిగువన వెళ్లి తోడుకున్నా... ఐదారు టీఎంసీలకు మించి లభించే పరిస్థితి లేకపోవడం కలవరపెడుతోంది. రాష్ట్రంలోని ఈ దుర్భర, దుర్భిక్ష పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కేంద్ర జల సంఘానికి నివేదించింది. లభ్యతగా ఉన్న నీటినంతా తాగునీటికే మళ్లిస్తున్నామని వివరించింది.

 తాగునీటికీ సరిపోని దుస్థితి
 గత ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులోనూ ఆశించిన నీరు చేరలేదు. గోదావరి బేసిన్‌లోని సింగూరు, నిజాంసాగర్ , శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు రాలేదు. ఈ మూడు ప్రాజెక్టుల్లో కలిపి నిల్వ సామర్థ్యం 147 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం లభ్యతగా ఉన్నది 5 టీఎంసీలే. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో సుమారు 20 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. ఇక కడెం, ఎల్లంపల్లి, దిగువ మానేరు ప్రాజెక్టుల్లోకి కొద్దిపాటి నీరు చేరడంతో ప్రస్తుతం వీటిల్లో 8 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. అది కూడా గతేడాదితో పోల్చితే సుమారు 3 టీఎంసీలు తక్కువే కావడం గమనార్హం.

ఇక కృష్ణా బేసిన్‌లోని జూరాలను మినహాయిస్తే... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు మొత్తంగా 100 టీఎంసీలకు మించి నీరు రాకపోవడం ఆందోళనకరం. ఖరీఫ్, రబీ సాగు అవసరాలను పూర్తిగా పక్కనపెట్టి ఈ రెండు ప్రాజెక్టుల నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకే కేటాయించినా కూడా సరిపోని దుస్థితి. ఈ రెండు ప్రాజెక్టుల వాస్తవ నిల్వ సామర్థ్యం 527 టీఎంసీలు కాగా... ప్రస్తుతమున్నది 150 టీఎంసీలే. ఇవి కూడా ప్రాజెక్టుల్లో వినియోగించుకోవడానికి వీల్లేని కనీస మట్టంలోని నీళ్లే. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలుకాగా... ప్రస్తుతం ఉన్నవి 167.68 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ వినియోగార్హమైన నీరు 6 నుంచి 7 టీఎంసీలకు మించదు.

 వచ్చే రెండు నెలలు కష్టమే..
 ప్రాజెక్టులన్నీ ఖాళీ కావడంతో వచ్చే రెండు నెలలు రాష్ట్రం దుర్భర స్థితిని ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. జూన్‌లో వర్షాలు మొదలైనా అవి ప్రాజెక్టుల పరీవాహకంలోని చిన్నపాటి కుంటలు, చెరువులు నిండేందుకే సరిపోతాయి. వర్షపు నీరు ప్రవాహాలుగా మారి ప్రాజెక్టుల్లోకి రావాలంటే భారీ వర్షాలు కురవాల్సిందే. గోదావరి బేసిన్‌లో జూన్‌లోనే వర్షాలు పడే అవకాశమున్నా, కృష్ణాలో మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి. ఈ దృష్ట్యా ప్రస్తుత నీటితో జూలై తొలివారం వరకు నెట్టుకురావడం కష్టం. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం ఏకంగా కనీస నీటిమట్టమైన 510 అడుగుల కన్నా దిగువన 507 అడుగులకు పడిపోయింది.

ఈ ఎత్తులో 127.80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కానీ అత్యవసర పంపులు వాడి 505 అడుగుల వరకు తోడినా ఒక టీఎంసీకి మించి నీటిని వాడటానికి లేదు. ఇక శ్రీశైలంలో 784.8 అడుగుల వద్ద 22.20 టీఎంసీల నీళ్లున్నా... అందులో 780 అడుగుల వరకు వినియోగార్హమైన నీరు ఒక టీఎంసీయే. దాంతో 770 అడుగుల వరకు వెళ్లి నీటిని తోడుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. అంతగా నీటిని తోడినా గరిష్టంగా 4 టీఎంసీలకు మించి నీరు లభించదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా 2 ప్రాజెక్టుల్లో కలిపి లభించే 5 టీఎంసీల నీటినే ఇరు రాష్ట్రాలు వాడుకోవాలి. ఇక ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల నుంచి 3 నుంచి 4 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశ ముంది. మొత్తంగా 6 నుంచి 7 టీఎంసీలకు మించి వాడటానికి రాష్ట్రానికి అవకాశం లేదు. ఈ నీటితోనే వచ్చే 2 నెలలు సర్దుకుపోవాలి. రాష్ట్రంలో కరువుపై కేంద్రం రాష్ట్రాల నుంచి వివరణ కోరగా... నీటి పారుదల శాఖ సోమవారం ప్రాజెక్టుల నీటి లభ్యతను వివరిస్తూ కేంద్ర జల సంఘానికి నివేదిక సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement