సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నదీ జలాల్లో విషపూరిత లోహ ధాతువులు ప్రమాదకర స్థాయికి చేరినట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో హెచ్చరించింది. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే వదిలేయడం, పంటలకు వాడే క్రిమిసంహారక మందుల అవశేషాలు వర్షపు నీటి ద్వారా చేరడం, విచ్చలవిడిగా గనుల తవ్వకాలు, మురుగు నీటిని నదుల్లోకి వదిలేస్తుండటం దీనికి ప్రధాన కారణమని పేర్కొంది.
ఆర్సినిక్, నికెల్, లెడ్, కాడ్మియం, కాపర్, క్రోమియం, ఐరన్ లాంటి లోహ ధాతువులు నదీ జలాల్లో కలిసిపోవడం మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారుతోంది. ఇవి రక్తప్రసరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయడంతోపాటు హృద్రోగాలు, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులు చుట్టుముడుతున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని అల్జీమర్స్ లాంటి రుగ్మతలు, చర్మ క్యాన్సర్లకు దారి తీస్తోంది. నదీ జలాలు విషతుల్యం కావడం మనుషులతోపాటు జంతువులు, పక్షులు, జలచరాల మనుగడపై కూడా తీవ్ర ప్రభావంచూపుతోంది.
కాలుష్యంలో పోటాపోటీ..
దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదుల నీటి నాణ్యతపై 2018 నుంచి సీడబ్ల్యూసీ అధ్యయనం నిర్వహించింది. గంగా నుంచి కుందూ వరకూ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో 688 నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షించింది. కాలుష్యంలో నదుల మధ్య పెద్దగా తేడా లేనట్లు అధ్యయనంలో వెల్లడైంది.
ఎక్కడ, ఎంత ప్రమాదకరం?
ఆర్సినిక్: ఇది అత్యంత విషపూరితమైన లోహం. ఆర్సినిక్ ధాతువులు లీటర్ నీటిలో 10 మైక్రో గ్రాములు (0.01 మిల్లీ గ్రాములు) వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో అన్ని నదుల్లోనూ 2,834 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది ప్రాంతాల్లో ఆర్సినిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది.
► భద్రాచలం వద్ద గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 10.17 మైక్రో గ్రాముల ఆర్సినిక్‌ను గుర్తించారు.
► తమిళనాడులో కావేరి ఉప నది అరసలర్ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 13.33 మైక్రో గ్రాముల ఆర్సినిక్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది.
లెడ్: ఆర్సినిక్ స్థాయిలోనే అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో పది మైక్రో గ్రాముల లెడ్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 3,111 చోట్ల నమూనాలు పరీక్షించగా 34 ప్రాంతాల్లో లెడ్ ధాతువులు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సోన్ నదీ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 67.5 మైక్రో గ్రాముల లెడ్ ఉంది.
కాడ్మియం: ఆర్సినిక్, లెడ్ తర్వాత కాడ్మియం అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో మూడు మైక్రో గ్రాముల వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలోని నదుల్లో 3,113 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 11 చోట్ల అత్యంత ప్రమాదకర స్థాయిలో కాడ్మియం ధాతువులున్నాయి.
► బద్రాచలం వద్ద గోదావరిలో లీటర్ నీటిలో 4.08 మైక్రో గ్రాముల కాడ్మియం ధాతువులున్నాయి.
►ఉత్తరప్రదేశ్‌లో సుకేత నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 12.57 మైక్రో గ్రాముల కాడ్మియం ఉన్నట్లు తేలింది.
నికెల్: ఇది మరో విషపూరిత లోహం. లీటర్ నీటిలో 20 మైక్రో గ్రాముల వరకూ నికెల్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,099 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 199 చోట్ల ప్రమాదకర స్థాయిలో గుర్తించారు.
► కీసర వద్ద మున్నేరు జలాల్లో లీటర్ నీటికి 33.84 మైక్రో గ్రాములు, వైరా జలాల్లో మధిర వద్ద లీటర్ నీటిలో 71.73 మైక్రో గ్రాములు, విజయవాడ వద్ద కృష్ణా జలాల్లో లీటర్‌కు 56.71 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. సింగవరం వద్ద చిత్రావతి జలాల్లో లీటర్ నీటిలో 56.58 మైక్రో గ్రాములు, తుంగభద్ర జలాల్లో లీటర్ నీటిలో బావపురం వద్ద 24.78, మంత్రాలయం వద్ద 25.53 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది.
► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 45.79, పోలవరం వద్ద 61.48 మైక్రో గ్రాములు నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది.
► తమిళనాడు ఎల్నుతిమంగలం వద్ద నొయ్యల్ నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 242.90 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది.
క్రోమియం: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల వరకూ క్రోమియం ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,106 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 50 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.
► రాష్ట్రంలో అల్లాదుపల్లి వద్ద కుందూ జలాల్లో లీటర్‌కు 56.04 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులున్నాయి. తుంగభద్ర జలాల్లో హర్లహళ్లి వద్ద లీటర్ నీటిలో 92.72 మైక్రో గ్రాముల క్రోమియం ఉంది.
► గోదావరి జలాల్లో మంచిర్యాల వద్ద లీటర్ నీటిలో 51.63 మైక్రో గ్రాములు, కిన్నెరసాని జలాల్లో లీటర్‌కు 60.44 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు తేలింది.
► ఛత్తీస్‌గఢ్ హస్‌డియో నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 180.47 మైక్రోగ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది.
కాపర్: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల లోపు మాత్రమే కాపర్ ధాతువులు ఉండాలి.
► దేశంలో 3,107 ప్రాంతాల్లో నీటి నమూనాలు పరీక్షించగా 17 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.
► మహారాష్ట్రలోని ఉల్హాస్ నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 132.64 మైక్రో గ్రాముల కాపర్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది.
ఐరన్: లీటర్‌కు 300 మైక్రో గ్రాములు (0.3 మిల్లీ గ్రాములు) వరకూ ఐరన్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 414 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది.
► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 0.69, పోలవరం వద్ద 4.75 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది.
► లీటర్ నీటికి మున్నేరు జలాల్లో 1.86, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల్లో 0.91 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది.
► నాగావళిలో శ్రీకాకుళం వద్ద లీటర్ నీటిలో 1.30 మిల్లీ గ్రాములు, మెళియపుట్టి వద్ద వంశధార జలాల్లో 1.09 మిల్లీ గ్రాములు, నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి జలాల్లో 0.49 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు గుర్తించారు.
► బెంగాల్‌లో పరక్కా ఫీడర్ చానల్ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 11.24 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment