సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తాము చేపట్టిన ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పూర్తి చేశామని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలిపింది. శనివారం ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీకి లెటర్ రాశారు. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి రివర్ లిఫ్టు స్కీములు మాత్రమే రాష్ట్ర విభజన తర్వాత చేపట్టామని, వాటి డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని తెలిపింది. ఆ డీపీఆర్‌లు రెడీ అయ్యాక బోర్డుకు సమర్పిస్తామని పేర్కొంది.
గురురాఘవేంద్ర, సిద్ధాపురం, శివభాష్యం లిఫ్ట్ స్కీములు, మున్నేరు స్కీం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీం సైతం రాష్ట్ర విభజనకు ముందే కంప్లీట్ చేశామని, అవేవీ కొత్త ప్రాజెక్టులు కానేకావని పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ 12వ మీటింగ్‌లో ఏపీ స్పెషల్ సీఎస్ ఆ ప్రాజెక్టులన్నీ విభజనకు ముందు చేపట్టినవేనని వివరించారన్నారు. వీటి డీపీఆర్‌ల విషయంలో ఇంకా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదని, వాటిని కొత్త ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని తేల్చి చెప్పారు.
డీపీఆర్‌లు రెడీ కాలేదు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తమ ప్రభుత్వం కొత్తగా గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి (హగరి) నది లిఫ్ట్ స్కీములను మాత్రమే చేపట్టిందని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని, డీపీఆర్‌లు రెడీ అయ్యాక కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం బోర్డుకు సమర్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment