
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు కేంద్ర అనుమతులు లభించాయి. ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తన ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 237 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు అంచనావ్యయం రూ.80,190.46 కోట్లకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. హెడ్ వర్క్స్ పనుల కోసం రూ.33,145.44 కోట్లు , నీటి సరఫరా వ్యవస్థ (కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు) కోసం రూ.47,045.02 కోట్లు వ్యయం అవుతాయని ప్రభుత్వం ప్రతిపాదించగా, దీనికి కేంద్ర జలసంఘం పచ్చజెండా ఊపింది.
ఈ అంచనా వ్యయాన్ని మూడేళ్ల వరకు సవరించకూడదని పేర్కొంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,190.46 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో 18 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. అందులో పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్, అంతర్రాష్ట్ర, ఇరిగేషన్ ప్లానింగ్, భూగర్భజల విభాగం అనుమతులు కీలకమైనవి. వీటిలో అటవీ, పర్యావరణ అనుమతులు, హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతి, భూగర్భజల విభాగం, యంత్ర నిర్మాణ సంప్రదింపు సంస్థ అనుమతులు లభించగా ప్రస్తుతం మరో రెండు కీలక అనుమతులు లభించాయి.
240 టీఎంసీల లభ్యత.. 237 టీఎంసీల వినియోగానికి ఓకే...
నిజానికి కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ వద్ద 180 టీఎంసీల నీటిని తీసుకుంటామని ప్రభుత్వం గతంలో తెలపగా, అనంతరం దాన్ని సవరించి మేడిగడ్డ వద్ద 195 టీఎంసీలు తీసుకుంటామని తాజాగా కేంద్రానికి సమర్పించిన నివేదికలో నీటి పారుదల శాఖ పేర్కొంది. ఈ 195 టీఎంసీలకు తోడు ఎల్లంపల్లిలో లభ్యతగా ఉండే 20 టీఎంసీలు, భూగర్భజలాల ద్వారా లభించే మరో 25 టీఎంసీలు కలిపి మొత్తంగా 240 టీఎంసీలను ప్రాజెక్టు కింద నిర్ణయించిన కొత్త, స్థిరీకరించే ఆయకట్టుకు, ఇతర అవసరాలకు నీరందిస్తామని కేంద్రానికి రాష్ట్రం తెలిపింది. ఈ 240 టీఎంసీల 237 టీఎంసీల వినియోగం ఉంటుందని, అందులో నీటిలో 169 టీఎంసీలు కొత్త, పాత ఆయకట్టుకు, 30 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పరీవాహక గ్రామాల తాగునీటికి మరో 10 టీఎంసీలు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు వినియోగించనుండగా, మరో 12 టీఎంసీలను ఆవిరి నష్టాలుగా చూపించారు. ఈ లెక్కలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ ప్రాజెక్టుకు 78శాతం సక్సెస్ రేటు ఉంటుందని అంచనా వేసి, దీనికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ డైరెక్టర్ విశ్వకర్మ మంగళవారం ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు.
మూడేళ్లపాటు వ్యయం సవరించొద్దు
ఇక ప్రాజెక్టు వ్యయ అంచనాను గతంలో రూ.80,499.71కోట్లుగా చూపగా, ప్రస్తుతం దాన్ని సవరించి రూ.80,190.46కోట్లుగా చూపారు. ఈ వ్యయ అంచనా వాస్తవాలకు దగ్గరగా ఉందని, మరో లేఖలో ఆ డైరెక్టరేట్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ప్రభుత్వానికి రాసిన మరో లేఖలో పేర్కొన్నారు. కనీసంగా మూడేళ్ల పాటు ఈ వ్యయాన్ని సవరించకుండా చూసుకోవాలని సైతం ఈ లేఖలో రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్‌కు అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment