నీళ్లు నిండుగ.. పంటలకు పండుగ
కృష్ణా నది పరీవాహకంలో ఈసారి 100 శాతం సాగుకు చాన్స్
నీళ్లు నిండుగ.. పంటలకు పండుగ
నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్, జూరాల జలాశయాలు
చిన్నా పెద్దా అన్ని ప్రాజెక్టులూ ఫుల్.. ముగిసిన క్రాప్ హాలిడే
14.5 లక్షల ఎకరాలకు 125 టీఎంసీలు సరఫరా చేసేలా ప్రణాళికలు
గోదావరి ప్రాజెక్టుల కింద 17.95 లక్షల ఎకరాలకు 188 టీఎంసీలు
ఎగువ గోదావరిలో ఆశించిన మేర రాని వరదలు
దీనితో పరీవాహకంలో లోయర్ మానేరు వరకే సరఫరా
స్కివం కమిటీ సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.
శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది.
రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్‌లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేందర్‌రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు.
కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే..
గత ఏడాది కృష్ణా బేసిన్‌లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి.
ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు.
గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..!
గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment