పైసలకు పోస్టులు!
* ‘సీడబ్ల్యూసీ’ నియామకాల్లో అక్రమాలు
* ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ అధికారులపై ఆరోపణలు
* చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు.. అంతర్గత కమిటీతో విచారణ
* కమిటీ సమగ్ర విచారణ జరపలేదని తాజా ఆరోపణలు
* సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు వరుస ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగ నియామకాల అంశం వివాదంగా మారింది. మల్టీ టాస్క్ సర్వీస్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో హైదరాబాద్ సీడబ్ల్యూసీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొద్ది నెలల కిందట 101 పోస్టుల భర్తీకి నియామకాలు జరగ్గా... సగానికిపైగా పోస్టులను డబ్బులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు వరుస ఫిర్యాదులు వెళ్లడం, విచారణ కమిటీని నియమించడం, ఆ కమిటీ నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి. అయితే విచారణ కమిటీ ఎవరినీ సంప్రదించకుండా, సమగ్ర వివరాలు సేకరించకుండానే తూతూమంత్రంగా విచారణ ముగించిందంటూ మళ్లీ సీడబ్ల్యూసీ చైర్మన్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళుతుండటంతో ఈ అంశం బయటకు పొక్కింది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. కేంద్ర జల సంఘంలో దేశవ్యాప్తంగా 2,200 వరకు మల్టీ టాస్క్ సర్వీస్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో గత ఏడాది జూలై-ఆగస్టు మధ్య కాలంలో హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 101 పోస్టులను భ ర్తీ చేయాలని నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించారు. శరీర దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లకు 80 మార్కులు, ఇంటర్వ్యూలకు మరో 20 మార్కులు కేటాయించారు. సుమారు 8,000 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా అందరికీ ఏపీలోని రాజమండ్రిలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి నుంచే కేంద్ర జల సంఘంలోని కొందరు అధికారులు అక్రమాలకు తెరతీసినట్లుగా చెబుతున్నారు. ఫిజికల్ టెస్టులో పాల్గొనని వారిని, పాల్గొని అర్హత సాధించని వారిని అడ్డదారుల్లో అర్హులుగా ఎంపిక చేసి, వారిని ఇంటర్వ్యూలకు పిలిచారని ఆరోపణలు ఉన్నా యి.
అక్రమదారిలో అర్హత సాధించిన అభ్యర్థులకు 20 మార్కులు ఉన్న ఇంటర్వ్యూలో అనుకూలంగా వ్యవహరించారని, ఇష్టారీతిగా వారికి మార్కులు వేసి అర్హత కల్పించారన్నది ఆరోపణ. ఇలా మొత్తం పోస్టుల్లో 50 శాతం వరకు అక్రమంగానే నియామకాలు చేపట్టారని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారని.. ఇలా రూ.2కోట్ల మేర చేతులు మారాయని సీడబ్ల్యూసీ చైర్మన్ పాండ్యాకు ఫిర్యాదులు వెళ్లాయి.
సీడబ్ల్యూసీలోని కొందరు ఉద్యోగులు సహా కొంతమంది బాధిత అభ్యర్థులు ఈ విషయమై అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లను పేర్కొంటూ ఫిర్యాదులు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ నియామకాలపై అంతర్గత కమిటీని నియమించి విచారణ జరిపారు. అయితే కొందరు అధికారుల అభిప్రాయాలనే తీసుకున్న కమిటీ ఈ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విచారణ కమిటీ తీరును సైతం ప్రశ్నిస్తూ మరలా కొందరు చైర్మన్ పాం డ్యాకు మరోమారు ఫిర్యాదు చేశారు. కమిటీ సమగ్రంగా విచారణ జరపలేదని, కేవలం కొద్ది మంది అభిప్రాయాలు సేకరించి విచారణ ముగించిందని.. అందుకే పునఃవిచారణ జరపాలని వారు కోరినట్లు సమాచారం.
పారదర్శకంగానే నియామకాలు: రమేష్ కుమార్
ఈ వ్యవహారంపై సీడబ్ల్యూసీలోని సూపరిం టెండెంట్ ఇంజనీర్ రమేష్ కుమార్‌ను వివరణ కోరగా, నియామకాల విషయంలో చైర్మన్‌కు ఫిర్యాదులు వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పా రు. దీనిపై చైర్మన్ అంతర్గత విచారణ జరిపిం చారని, అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్నదేమీ జరగలేదని విచారణలో తేలిందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయని అన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ఒకరిద్దరు ఉద్యోగులపై ఆరోపణలు రా గా, వారిని పూర్తిగా ఈ ప్రక్రియకు దూరంగా ఉంచి నియామకాలు చేపట్టామని తెలిపారు.