
చివరి దశకు జల జగడం!
భామిని: అంతర్ రాష్ట్ర జల వివాదం త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన వంశధార ప్రాజెక్టు పనుల అనుమతుల సాధనపై కదలిక వచ్చింది. ఒడిశా లేవనెత్తిన ఆభ్యంతరాల చిక్కుముడులు విప్పేందుకు చేపట్టిన చర్యలు ముగింపు దశకు వచ్చాయి. ఈ దశలో వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన నివేదికను ఇంజి నీరింగ్ అధికారుల బృందం శుక్రవారం (ఈ నెల 8 తేదీ) సంబంధిత ట్రిబ్యునల్‌కు అందజేయనుంది.
ఇందుకోసం అధికారుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ద్వారా సంపాదించిన 18 రకాల అభ్యంతరాలకు కావాల్సిన వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించనున్నా రు. ఇప్పటికే రాష్ట్ర సమన్వయాధికారి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో వంశధార ఈఈ బి.రాంబాబు ఢిల్లీలో మకాం వేసి సీడబ్ల్యూసీ అధికారుల ద్వారా ట్రిబ్యునల్‌కు సమర్పించడానికి కావాల్సిన చర్యలు పూర్తి చేశారు. ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ భామిని మండలంలోని వంశధార ప్రా జెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో నివేదికలు సేకరించి ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఆదేశించారు.
గతం ఇలా..
వంశధార ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం అనేక అభ్యంతరాలను లేవనెత్తింది. దీం తో విషయం కోర్టుకు వెళ్లింది. ఈ పరిస్థితిలో గత ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఆధ్వర్యంలోని బృందం ఇరు రాష్ట్రాల్లోని వంశధార ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం డిసెంబర్ 17న ట్రిబ్యునల్ తీర్పునిచ్చి వంశధార నదిపై సైడ్‌వియ్యర్ నిర్మించి ఓపెన్‌హెడ్ చానల్ ద్వారా సాగునీరు తరలించుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అనంతరం రెండు రాష్ట్రాల్లోను ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేశాయి.
దీంతో ఈ ఏడాది మార్చి 22న మరోసారి ట్రిబ్యునల్ బృందం వంశధార ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పునః పరిశీలించింది. ట్రిబ్యునల్ ముం దు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయి నివేదికలను కూడా ఇప్పుడు వంశధార అధికారులు సిద్ధం చేసి ట్రిబ్యునల్‌కు అందజేయనున్నారు. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూనే లో జరిపిన మోడల్ సర్వేలోనూ గుర్తించిన నివేదికలను సైతం అందించనున్నారు. దీంతో వంశధారకు ట్రిబ్యునల్ నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావచ్చునని జిల్లా వాసులు భావిస్తున్నారు.