నిప్పులు కక్కిన నీళ్లు | TDP, Congress supporters Quarreling in srikakulam district due to water dispute | Sakshi
Sakshi News home page

నిప్పులు కక్కిన నీళ్లు

Published Tue, Mar 11 2014 11:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

దాడులకు ఉపయోగించిన రాళ్లతో నిండిన ఓ విధి (ఇన్సెట్లో) పిల్లా రమణయ్య మృతదేహం - Sakshi

దాడులకు ఉపయోగించిన రాళ్లతో నిండిన ఓ విధి (ఇన్సెట్లో) పిల్లా రమణయ్య మృతదేహం

నీళ్లు నిప్పును ఆర్పేస్తాయంటారు.. కానీ ఆ నీళ్లే ఇప్పుడు నిప్పులు కక్కాయి. పాతకక్షల జ్వాలను ఎగదోశాయి. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సుమంతాపురం(పొడుగుపాడు) గ్రామాన్ని వణికించాయి. ఆదివారం నీళ్ల విషయంలో మహిళల మధ్య రేగిన గొడవ సర్దుబాటు అయినట్లు కనిపించినా.. అది నివురు గప్పిన నిప్పులా మారి.. సోమవారం ఉదయం రాజుకుంది. గ్రామం మొదటి నుంచీ కాంగ్రెస్, టీడీపీ సానుభూతిపరులుగా విడిపోయింది. ఉదయం టీడీపీ వర్గీయుడు పాలకేంద్రానికి వెళుతుండగా కాంగ్రెస్ మద్దతుదారులు అడ్డుకోవడం.. అది తెలిసి అక్కడికి వచ్చిన మరి కొందరు టీడీపీ సానుభూతిపరులు ప్రశ్నిం చడంతో గొడవ పెద్దదైంది. కాంగ్రెస్ వర్గీయులు తిరగబడటంతో ఇరువర్గాలు కొట్లాటకు సై అన్నాయి. అంతే.. గ్రామంలో రాళ్ల వర్షం కురిసింది. టీడీపీకి చెందిన 14మంది గాయపడ్డారు. వారి లో పిల్లా రమణయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అసువులు బాశాడు. మొదట దాడికి పాల్పడిన నిందితులు ఒక హత్య కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యారు. దాంతో గ్రామం మళ్లీ ఉద్రిక్తత నీడలోకి వెళ్లిపోయింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న కక్షలు మళ్లీ విద్వేషాగ్నిని వెళ్లగక్కాయి.  

 
శ్రీకాకుళం: సుమంతాపురంలో సోమవారం జరిగిన కొట్లాటలో పిల్లా రమణయ్య(55) మృతి చెందగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు, బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒమ్మి అమ్మడమ్మ  తాను పెంచుకున్న కోడి పోయిందంటూ.. ఆదివారం రాత్రి తిట్ల దండకం అందుకుంది. కొందరు కలగజేసుకుని, తిట్టవద్దని ఆమెను  కోరారు. మరి కొందరు వచ్చి..తగువును ఆపారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. సోమవారం  ఉదయం కాంగ్రెస్ వర్గానికి చెందిన తూలుగు పాపమ్మ అనే వృద్ధురాలు తాగునీటికోసం గ్రామానికి శివారున ఉన్న బోరు వద్దకు  వెళుతుండగా..ఇటువైపు రావద్దని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు.

దీంతో ఆమె వెనక్కి వెళ్లిపోయింది. 8 గంటల సమయంలో టీడీపీకి చెందిన కర్నం  సోమేష్ ఆటోలో పాల కేంద్రానికి పాలు తీసుకుని వెళుతుండగా కాంగ్రెస్ వర్గీయులు  అడ్డుకుని, ఆటో ఇటువైపు రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు  పిల్లా రమణయ్య,  ఆనందరావు,  గజపతిరావు, గోపాల్‌తో పాటు మరికొందరు సామరస్యంగా అడిగేందుకు ఆటోవద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన  తూలుగు ప్రసాదరావు, చిన్నబాబు, వెంకటస్వామి, రామారావుతో పాటు పలువురు దాడికి తెగబడ్డారని  పోలీసులు చెప్పారు. విషయం తెలుసుకున్న గాయపడిన వర్గానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.  

ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. రాళ్ల వర్షం కురవడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది.  సుమారు గంట కాలంపాటు ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు, బాధితులు వాపోయారు. గ్రామంలోని వీధులన్నీ రాళ్లమయమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమనిగింది. గాయపడిన వారిని ఆటోలు, 108 అంబులెన్స్‌లలో ఆమదాలవలస ప్రభుత్వాస్పత్రికి, శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని పోలీసులు చెప్పారు. ఆమదాలవలసలో చికిత్స పొందుతూ..రమణయ్య ప్రాణాలు కోల్పోయాడన్నారు.  మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయాలపాలైన వారిలో  పిల్లా ఆనందరావు,  గజపతిరావు,  గోపాల్, నాగేశ్వరరావు, గోవిందమ్మ, కంటుమజ్జి సత్యనారాయణ,  తూలుగు చిన్నబాబు,  వెంకటస్వామి,  రమణయ్య,  అప్పలనర్సమ్మ,  రామారావు, రజనీకాంత్, కర్నం ధనుంజయరావు,  సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు. వీరిలో రిమ్స్‌లో చికిత్స పొందుతున్న  ఆనందరావు, గోపాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు.

 సంఘటన స్థలాన్ని ఎస్పీ నవీన్ గులాఠీ, శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, ఆమదాలవలస సీఐ విజయానంద్, ఎస్సై ఎన్.సునీల్, సరుబుజ్జిలి ఎస్సై ఎం.శ్రీనివాస్, ఎన్.లక్ష్మణ్‌లతో పాటు పలువురు పోలీసు సిబ్బంది గ్రామాన్ని సందర్శించి శాంతి భద్రతలు అదుపులోనికి తెచ్చారు.

సత్ప్రవర్తనపై వచ్చినవారే దాడి చేశారు..
2000 మే లో సుమంతాపురం పంచాయతీ గడేవానిపేట గ్రామానికి చెందిన రేషన్  డీలర్ లావేటి సూరన్నపై  సుమంతాపురం గ్రామానికి చెందిన తూలుగు చిన్నబాబు, వెంకటస్వామి, రామారావు, సూర్యనారాయణలతో పాటు మరికొంతమంది దాడిచేసి హత్యచేశారు. ఈకేసులో  2006 నవంబర్‌లో కోర్టు తూలుగు చిన్నబాబు, వెంకటస్వామి, రామారావులకు జీవిత ఖైదు  విధించింది.  సూర్యనారాయణతోపాటు మరికొంతమందిపై  నేరారోపణ కాలేదని కోర్టు విడిచి పెట్టింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన  ఈ ముగ్గురిని  ఈఏడాది జనవరిలో సత్పవర్తనపై  విడుదల చేశారు.  వీరు గ్రామానికి వచ్చిన నుంచి గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని మాజీ సర్పంచ్ కంటుమజ్జి సత్యనారాయణ తెలిపారు. వీరే తన తండ్రిని చంపారని మృతుని కుమారుడు పిల్లా తిరుపతిరావు రోదిస్తూ చెప్పాడు.

ముందుగానే స్పందించాల్సింది
పోలీసులకు ఎస్పీ నవీన్ గులాఠీ చీవాట్లు
సుమంతాపురం గ్రామంలో ఆదివారం రాత్రి మహిళల మధ్య చెలరేగిన ఘర్షణ సమాచారం తెలిసిన వెంటనే..అప్రమత్తం కావాల్సిందని ఎస్పీ నవీన్ గులాఠీ సిబ్బందిని మందలించారు.  సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామస్తులతో మాట్లాడి, సంఘటనపై ఆరా తీశారు.  డీఎస్పీ శ్రీనివాసరావు, ఆమదావలస సీఐ విజయానంద్‌లకు పలు సూచనలు ఇచ్చారు. అత్యంత సమస్యాత్మక గ్రామమైన సుమంతాపురంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో 450 అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని ఎన్నికల ముందు వీటిపై నిఘా పెంచుతామన్నారు.  కొట్లాట కేసులో  ఇప్పటికే 20 మందిని అదుపులో తీసుకున్నామన్నారు.

40 మందిపై కేసులు నమోదు
సుమంతాపురం గ్రామంలో జరిగిన కొట్లాటలో రెండు వర్గాలకు చెందిన 40 మందిపై కేసులు నమోదు చేశామని ఆమదాలవలస సీఐ విజయానంద్ తెలిపారు. కొట్లాటలో గాయపడి న పిల్లా రమణయ్య(55) మరణించడంతో హత్య, దాడిచేసి గాయపర్చడం వంటి కేసులు నమోదు చేసి,  దర్యాప్తు చేస్తున్నామన్నారు.

144 సెక్షన్
సుమంతాపురం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని  శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు చెప్పారు.  గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట తరువాత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. చర్యలు చేపడుతున్నామన్నారు. ఎచ్చెర్ల ఏఆర్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామని, గ్రామంలో  పోలీస్ పికెట్ కొనసాగుతోందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement