బక్రీద్ సందర్భంగా చెన్నైలో ప్రార్థనల అనంతరం విరాళమిస్తున్న ముస్లిం మహిళ
వరదలు ముంచెత్తడంతో నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయానికి యూఏఈ ముందుకొచ్చింది. భారత్‌తో మరీ ముఖ్యంగా కేరళతో యూఏఈకి ప్రత్యేక సంబంధాలున్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం ఇంత భారీ సాయాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని స్వీకరించబోమని భారత ప్రభుత్వం తెలిపింది. విదేశీ విరాళాలను అంగీకరించబోవడం లేదని సమాచారం.
2004 డిసెంబర్ నుంచే అమల్లోకి
2004 డిసెంబర్‌లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిది. ఈ ‘విపత్తు సహాయ విధానం’లో భాగంగా విదేశీ సహాయాన్ని అంగీకరించకూడదని నిర్ణయించింది. సునామీ కారణంగా భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో తీవ్రనష్టం సంభవించిన సందర్భంలో ఈ విధానాన్ని ఖరారు చేశారు. సునామీ అనంతర సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలు భారత్ సొంతంగా చూసుకోగలదని మన్మోహన్ చెప్పారు. కేరళలోని విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు దేశీయం గా అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలనే వినియోగించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉంది.
దౌత్య కార్యాలయాలకు వర్తమానం
కేరళ విపత్తుపై విదేశీ ఆర్థిక సహాయాన్ని స్వీకరించవద్దని ఇప్పటికే అన్ని రాయబార కార్యాలయాలకు మోదీ ప్రభుత్వం వర్తమానం పంపించింది. ఏ దేశ ప్రభుత్వమైనా సహాయం చేసే ఉద్దేశాన్ని వెల్లడిస్తే దానిని సున్నితంగా తిరరస్కరించాలని భారత రాయబార కార్యాలయాలకు పంపిన సందేశంలో పేర్కొంది. చివరగా 2004లో బిహార్ వరదలతో అతలాకుతలమైనపుడు విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని భారత్ తీసుకుంది. ఆ తర్వాతి సందర్భాల్లో తిరస్కరించింది.
ఎన్‌ఆర్‌ఐల విరాళాలపై పన్ను లేదు
ఇతర దేశాల ప్రభుత్వాలిచ్చే విరాళాలు, ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తున్నా, ఆ దేశాల్లోని భారతీయులు కేరళ సీఎం సహాయనిధికి నేరుగా విరాళాలు పంపించవచ్చు. వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. ‘విదేశీ విరాళాల చట్టం కింద గుర్తింపు పొందిన, లాభాపేక్ష లేని స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా వచ్చే విదేశీ సాయంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి చెప్పారు.
కేంద్రం నిర్ణయంపై కేరళ అసంతృప్తి!
కొచ్చి: కేరళ వరదలకు విదేశాలు చేస్తున్న సాయాన్ని కేంద్రం తోసిపుచ్చడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ విరాళాలు అత్యవసరమని రాష్ట్ర సీఎం భావిస్తున్నారు. యూఏఈ విరాళంపై పునరాలోచించాలని ప్రధానిని కలిసి విన్నవించనున్నట్లు విజయన్ తెలిపారు. విదేశీ సాయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కూడా వారు ప్రధానిని కోరనున్నారు. యూఏఈ రూ.700కోట్లు, ఖతార్ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment